భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాల వేళ లడ్డూ వేలం పాటలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం రికార్డును దిల్సుఖ్నగర్ లడ్డూ అధిగమించింది. అక్కడ నిర్వహించిన వేలంలో గణేశుడి ప్రధాన లడ్డూ ఏకంగా రూ.51 లక్షలకు అమ్ముడైంది.దిల్‌సుఖ్‌నగర్‌లోని జై గణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 2.5 కోట్ల మిర్రర్ గ్లాస్‌లతో ప్రత్యేకంగా అలంకరించిన గణేశుడి మండపంలో శనివారం లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు.చివరకు స్థానిక భక్తుడు రాజేష్ రూ.51 లక్షలు వెచ్చించి ప్రధాన లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంలో నమోదైన రూ.39 లక్షల ధరను దిల్సుఖ్నగర్ లడ్డూ దాటింది.ఇదే మండపంలో మరో లడ్డూకు కూడా భారీ ధర పలికింది. మరో భక్తుడు రూ.25 లక్షలకు దక్కించుకున్నారు.గణేశుడి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళితే శుభం కలుగుతుందని, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని భక్తుల్లో విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతోనే వేలంలో భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులను సామాజిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని జై గణేశ్ యూత్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.


