Homeతెలంగాణఖైరతాబాద్ లో పోటీ చేస్తాం.. : కవిత

ఖైరతాబాద్ లో పోటీ చేస్తాం.. : కవిత

- Advertisement -

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో తాము నిలవబోతున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అధికారికంగా అభ్యర్థిని బరిలోకి దించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇదే సమయంలో ఫిరాయింపు రాజకీయాలపై మండిపడిన ఆమె… ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, వేరే పార్టీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని దానం నాగేందర్ తీరును పరోక్షంగా తప్పుబట్టారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణపై స్పందిస్తూ… కేవలం క్లరికల్ తప్పుల పేరుతో ఓట్లు తొలగిస్తున్నారనే విమర్శలున్నాయని, బీజేపీని ప్రసన్నం చేసుకునేలా ఈ కుట్ర జరుగుతోందన్న చర్చ ప్రజల్లో నడుస్తోందని ఆమె ఆరోపించారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు గాడితప్పుతున్నాయని, ప్రభుత్వం వాటిని తక్షణమే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. నిమ్స్, నీలోఫర్ వంటి పెద్ద ఆసుపత్రులలో మంత్రులు స్వయంగా ఫోన్ చేసినా బెడ్లు దొరకని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 11 రకాల ఆరోగ్య పథకాలకు కనీస బడ్జెట్ కేటాయించలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని దుయ్యబట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రులు పట్టించుకోవడం మానేశారని విమర్శించిన కవిత… జిల్లాల కలెక్టర్లు క్రమం తప్పకుండా హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయాలని సూచించారు. తాము కూడా తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను మదింపు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇన్ని పసిమొగ్గలు రాలిపోతుంటే… తెలంగాణను సింగపూర్, డల్లాస్ చేస్తామని సీఎం, మంత్రులు ఎలా గొప్పలు చెప్పుకుంటారని నిలదీశారు. ఐటీడీఏకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఏకంగా 70 శాతం నిధులను ఖర్చు చేయకుండా వృథా చేశారని ఆరోపించారు. కోఠి ఆసుపత్రిలో మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామన్న ప్రతిపాదనను గత బీఆర్ఎస్ హయాంలోనే అడ్డుకున్నారని గుర్తుచేశారు.

తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలను కవిత పూర్తిగా ఖండించారు. తనది ఎలాంటి కబ్జా భూమి కాదని, ఇనాం లేదా అసైన్డ్ భూమి అంతకంటే కానేకాదని స్పష్టం చేశారు. తన ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో కూడా లేదని స్పష్టం చేస్తూ… తన ఆస్తులకు సంబంధించిన ప్రతి వివరమూ ఎన్నికల అఫిడవిట్లోనే స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై, ఇతర ప్రతిపక్ష నేతలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ఫామ్‌హౌస్‌లకు వెళ్లిన పెద్దలు అప్పట్లో ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు