తెలంగాణలో కొత్తగా 41 బార్ అండ్ రెస్టారెంట్ల (2బీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరితో కూడిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో 14, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 27 బార్లకు లైసెన్సులు మంజూరు చేయనున్నారు.ఆసక్తి ఉన్నవారు ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయల నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి అక్టోబర్ 12 వరకు ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో విజేతలను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు లైసెన్స్ తీసుకోకపోతే లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.ప్రాంతాన్ని బట్టి వార్షిక బార్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను (బీఈటీ) నిర్ణయించారు. టీసీయూఆర్ పరిధిలోని బార్లకు రూ.44 లక్షలు, బోధన్ వంటి కొన్ని ప్రాంతాలకు రూ.42 లక్షలు, మిగిలిన మున్సిపాలిటీల్లో రూ.30 లక్షలుగా రుసుము ఖరారు చేశారు. ఈ 41 కొత్త బార్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.14.62 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా దేవరకద్ర, ఎల్లంపల్లి, మద్దూరు, గుమ్మడిదల వంటి ప్రాంతాల్లో తొలిసారిగా బార్లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు చేవెళ్ల, మొయినాబాద్, కొడంగల్, పరిగి, అశ్వరావుపేట, కల్లూరు, మక్తల్, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు వంటి పలు మున్సిపాలిటీల్లోనూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1,185 బార్లు ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 657 బార్లు ఉన్నాయి.


