‘అమెరికా ఆయుధాలు కొనుగోలు చేస్తారా?‘ అంటూ చైనా అధ్యక్షుడు జెన్పింగ్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా అడిగేశారు. ఈ విషయాన్ని చైనాలో అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ వెల్లడించారు. ‘ఫాక్స్ న్యూస్ సండే్ణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. చైనా అధ్యక్షుడిని వాషింగ్టన్లో పర్యటించాల్సిందిగా ట్రంప్ ఆహ్వానించిన కొన్ని రోజులకే ఈ విషయం బయటకు రావడం గమనార్హం. ఈ విషయంపై పెర్డ్యూ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ చెబుతుంటారు, మనం ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు ఆయుధాలు అమ్ముతామని. ఒకసారి ఆయన చైనా అధ్యక్షుడిని, ‘మీరు కొన్ని కొనాలనుకుంటున్నారా? అని అడిగారు అని వివరించారు. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మే విషయంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తైవాన్‌కు 14 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ప్యాకేజీ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. గత డిసెంబర్లో కూడా ట్రంప్ 11.1 బిలియన్ డాలర్ల ఆయుధాలను తైవాన్‌కు అమ్మేందుకు అనుమతించారు.
అయితే, అమెరికా చట్టం ప్రకారం చైనాకు ఆయుధాలు అమ్మడంపై పూర్తి నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్, స్టేట్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాయి. చైనాకు ఆయుధాలు అమ్మే ప్రణాళిక గానీ, అటువంటి ఆఫర్ గానీ ఏదీ లేదని స్పష్టం చేశాయి. మరోవైపు, తైవాన్ విషయంలో ట్రంప్ విధానంలో ఎలాంటి మార్పు లేదని, ఆయన వైఖరి బలంగా ఉందని పెర్డ్యూ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఆఫర్‌కు జిన్‌పింగ్ ఎలా స్పందించారన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.


