విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : :బిజెపికి కనుసన్నల్లో పరిపాలన చేస్తున్న దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఙానేశ్వర్ కుమార్ రాజీనామా చేయ్యాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ఆదోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ భారతదేశంలో ఎస్ఐఆర్ పేరుతో దేశ ప్రధాన ఎన్నికల అధికారి జ్ఙానేశ్వర్ కుమార్ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కలకత్తాలో తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సంబంధించిన దాదాపు కోటి ఓట్లను తొలగించారని, ఇదంతా బిజెపి కనుసన్నల్లోనే జరుగుతుందని తెలిపారు. కేవలం బిజెపి పార్టీ ఓట్లు మాత్రమే ఉంచి, ఇతర పార్టీల ఓట్లను తొలగించి బిజెపి నాయకుల మెప్పు పొందేందుకు ఎన్నికల కమిషనర్ జ్ఙానేశ్వర్ కుమార్ పని చేస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు పాల్పడుతున్నారని, తక్షణమే ప్రధాన ఎన్నికల అధికారి జ్ఙానేశ్వర్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. మండలంలో కూడా ఎస్ఐఆర్ పేరుతో చాలా ఓట్లు తొలగించారని, ఎస్ఐఆర్ ను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహయ కార్యదర్శిలు కుమ్మరిచంద్ర, తిక్కన్న, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు రామాంజనేయులు, సిపిఎం పరమేష్, వెంకటేష్, కోతి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


