ఎకరాకు రూ. లక్ష నష్టపరిహారం, టన్ను అరటిని రూ.22 వేలకు కొనుగోలు చేయాలి: డి. చిన్నప్ప యాదవ్
విశాలాంధ్ర – నార్పల: – గాలి, వానలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి రైతులకు తక్షణమే నష్టపరిహారం, పంటల బీమా అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి. చిన్నప్ప యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేలకొరిగిన అరటి గెలలను ఉద్యాన శాఖ టన్నుకు రూ.22 వేల గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నార్పల మండలంలోని నడిమిదొడ్డి గ్రామంలో ఇటీవల గాలి, వానలతో నేలకొరిగిన అరటి తోటలను రైతు సంఘం నాయకులు, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు నవీన్, వీర చిన్ననారప్ప, వీర పెద్దనారప్ప, సాలయ్యలకు చెందిన అరటి తోటలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేశారు.ఈ సందర్భంగా డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా అరటి సాగు జరుగుతోందని, రైతులు లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ఏడాది పాటు శ్రమించి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనం, వ్యాధుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక్కో ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు గాలి, వానల కారణంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యాన, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి ఎకరాకు కనీసం రూ.1 లక్ష నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పంటల బీమా సొమ్మును అర్హులైన రైతులకు తక్షణమే విడుదల చేయాలని కోరారు.
అరటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం టన్ను అరటిని రూ.22 వేల చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటిస్తున్న ప్రభుత్వం ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతోందని విమర్శించారు.అరటిలో సిగటోకా, గారమచ్చ తదితర వ్యాధులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రతి రైతు సేవా కేంద్రంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని, ఉద్యాన రైతులకు 90 శాతం సబ్సిడీతో నాణ్యమైన నాట్లు, మల్చింగ్ పేపర్లు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు మధు యాదవ్, సీపీఐ నార్పల మండల కార్యదర్శి సాకే గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య, వీఆర్వో రవి, ఉద్యాన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, సీపీఐ నాయకులు సాకే సుధాకర్, నాగరాజు, రైతులు నవీన్, వెంకటరాముడు, చంద్రయ్య, రాజు, నాగన్న తదితరులు పాల్గొన్నారు.


