పంట నష్టానికి పరిహారం అందించి న్యాయం చేయాలి: రైతు మురళి
విశాలాంధ్ర – నార్పల: మండల పరిధిలోని మాలవాండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు మురళి నాసిరకం మొక్కజొన్న విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నర ఎకరాల భూమిని గుత్తకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేసినట్లు తెలిపారు. అనంతపురం నగరంలోని రేవతి సీడ్స్ దుకాణంలో కొనుగోలు చేసిన విత్తనాలను సాగు చేయగా పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
విత్తనాల కొనుగోలు, సాగు ఖర్చులు, భూమి గుత్త కలిపి మొత్తం రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని, అయితే నాసిరకం విత్తనాల వల్ల ఆశించిన దిగుబడి పూర్తిగా కోల్పోయానని వాపోయారు. ఇప్పటికే మూడున్నర నెలలు గడిచినా పంటలో కంకులు సరిగా రాలేదని, వచ్చిన కంకులు కూడా పూర్తిగా ఎదగక గింజలు లేకపోవడంతో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
మంచి పంట వస్తుందనే నమ్మకంతో అప్పులు చేసి సాగు చేశామని, కానీ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విత్తనాల కంపెనీ ప్రతినిధులు, దుకాణ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా వారు రెండుసార్లు పొలాన్ని పరిశీలించారని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
రైతుల తప్పు ఏమీ లేదని అంగీకరిస్తూనే నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు న్యాయం చేయాలని కోరినా స్పందన లేకపోవడంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని నాసిరకం విత్తనాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, పంట నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని రైతు మురళి కోరారు. అలాగే విత్తనాలు విక్రయించిన ప్రైవేట్ దుకాణం, సంబంధిత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


