— ఎమ్మెల్యే గోరంట్ల
విశాలాంధ్ర – కడియం : రాజమహేంద్రవరం, మోరంపూడి నుండి కడియం మండలం పొట్టిలంక వరకు జాతీయ రహదారికి ఆనుకుని సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జాతీయ రహదారుల విభాగం పిడి కృష్ణ మూర్తి, వారి బృందంతో కలిసి మోరంపూడి నుండి పొట్టిలంక వరకు జాతీయ రహదారిపై ఉన్న పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ పై ఉన్న రోడ్డు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని, చక్కటి రంగులతో ఫ్లై ఓవర్ ను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గదాలమ్మ నగర్ ఆర్చ్ వద్ద ఫ్లైఓవర్ స్టార్ట్ పాయింట్ వద్ద హైవే, సర్వీస్ రోడ్లను పరిశీలించామని, త్వరలో మోరంపూడి నామవరం రోడ్ 4 లైన్ల రోడ్డు కాబోతుందని కావున మోరంపూడి జంక్షన్ వద్ద విస్తరణ పనులు చేపట్టాలని, అలాగే హైవే కి ఆనుకొని ఉన్న నేతాజీ నగర్ చివరి వీధులకు వెళ్లే ఆప్రోచ్ రోడ్డుకు కలుపుతూ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయలని, డ్రైన్లు పొడిగించాలని, మోరంపూడి జంక్షన్ నుండి ఫ్లైఓవర్ చివరి వరకు ఆక్రమణలు తొలగించి, సర్వీస్ రోడ్డు వెడల్పు చేయాలి అని కోరారు. హుకుంపేట జంక్షన్ వద్ద కూడా సర్వీస్ రోడ్డు తో పాటు డ్రైన్ పనులు చేపట్టాలని, ఈస్ట్ రైల్వే రోడ్డుపై వంతెన నిర్మాణం పూర్తయిందని, 4 లైన్ల రోడ్డు వస్తుందని సదరు రోడ్డును అక్కడ డి మార్ట్ వద్ద ఉన్న 100 అడుగుల సర్వీస్ కు కలపాలని, హుకుంపేట జంక్షన్ లో సెంటర్ లైటింగ్ వస్తుందని, అలాగే బొమ్మూరు హుకుంపేట మధ్యలో ఉన్న కల్వర్ట్ లను పరిశీలించారు. బొమ్మూరు సెంటర్ లో రోడ్డు మలుపులు లేకుండా జంక్షన్ నుండి మురళీ కొండ వద్ద ఎగువ వరకు తిన్నగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అక్కడ ఆక్రమణలు వెంటనే సర్యే చేయించి తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించే విధంగా రోడ్డు నిర్మాణం ఉండాలని, అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ త్వరలో రాబోతుందని తెలిపారు.
అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు విస్తరణ చేయాలని, అలాగే ఇండస్ట్రీయలు కాలనీ వద్ద అండర్ పాస్ నిర్మించాలని, ఇక్కడ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేస్తామని పీడీ తెలిపారు. అలాగే ఇండస్ట్రీయల్ కాలనీకి ఆనుకొని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, త్వరలో అది పెద్ద ఆవాస ప్రాంతం అవుతుందని, కావున కాలనీ శివారున ఉన్న రౌండ్ కల్వర్ట్ ప్రాంతంలో బాక్స్ కల్వర్ట్ ఏర్పాటు చేయాలని, వేమగిరి జంక్షన్ వద్ద త్వరలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మొదలవుతాయని ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాస్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కడియం బుర్రిలంక, పొట్టిలంక గ్రామాలలో కూడా బాక్స్ కల్వర్ట్లు ఏర్పాటు చేయాలని, అలాగే వేమగిరి వద్ద కల్వర్టు పూడికతో నిండిపోయిందని సదరు పూడిక తొలగించాలని, బుర్రిలంక నుండి కడియపులంక వరకు గల నర్సరీ రైతులు గ్రామస్తులు హైవే ప్రక్కన మరియు మధ్యలో చెత్త వేస్తున్నారని గమనించి, గ్రామ పెద్దలను సంబంధిత శాఖాధికారులను పిలిపించి శుభ్రం చేయించాలని, ఇటువంటి పనులు చేసే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, మండల సర్వేయర్లు భువన్, రామకృష్ణ, సిఐలు కాశీ విశ్వనాథ్, వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర రైతు నాయకులు అన్నదేవుల చంటి, మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, పాఠంశెట్టి రాంజీ, ఆర్.ఐ ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ ప్రవీణ్ పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


