ఎన్నికల సంఘం తీరుపై నేతల ఆగ్రహం
బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
విశాలాంధ్ర–ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఓటు చోరీ ఆరోపణలు, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ శుక్రవారం ఉరవకొండలోని గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ తక్షణమే రాజీనామా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం బీజేపీకి రబ్బర్ స్టాంప్‌లా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు. దేశంలో ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జై మల్లికార్జున, ఉరవకొండ కార్యదర్శి చెన్నారాయుడు, సీపీఎం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, రంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బ్యాళ్ల ప్రసాద్, జిల్లా కార్యదర్శి సోనియా సీనా పాల్గొన్నారు. సీపీఐ నాయకులు సుల్తాన్, ఆంజనేయులు, యువజన సమైక్య నాయకులు నవీన్‌బాబు, ఏపీ మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి నూర్జహాన్, వన్నూరమ్మ, వనజాక్షి, సీపీఎం నాయకులు వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.


