. ఎంఎస్పీ చట్టం తెస్తే సమస్య: కేంద్రమంత్రులు
. ఏ ఇబ్బంది ఉండదు: రైతులు
. అసంపూర్తిగా ముగిసిన ఏడవ దఫా చర్చలు
. మే 4న తదుపరి భేటీ
చండీగఢ్: రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఎంఎస్పీ చట్టం తెచ్చేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. ఈ చట్టం తెస్తే సమస్యలు వస్తాయని వాదిస్తోంది. దీంతో రైతుల డిమాండ్ల పరిష్కారంపై అనిశ్చితి కొనసాగుతోంది. దశలవారీ చర్చల్లో దీనిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. తాజాగా చండీగఢ్‌లోని సెకార్ 26లో గల మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కేంద్ర మంత్రులు`రైతు నాయకులు ఏడవసారి భేటీ అయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈ సమావేశం బుధవారం ఉదయం 11.45కు మొదలైంది. దాదాపు నాలుగు గంటలు సాగింది. చివరకు అసంపూర్తిగా ముగిసింది. దీంతో మే 4న మళ్లీ భేటీ కావాలని కేంద్ర మంత్రులు, రైతు నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు వివరాలను సమావేశం అనంతరం కేంద్రమంత్రి చౌహాన్ విలేకరులకు తెలిపారు. ఎంఎస్పీ చట్టంపైనే దాదాపు మూడు గంటలు చర్చించినట్లు రైతు నేతలు చెప్పారు. సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తెలిపారు. ఎంఎస్పీ చట్టం రూపొందించడానికి ముందు అందరు భాగస్వాములతో చర్చిస్తామని కేంద్ర మంత్రులు చెప్పారని, ఇందుకోసం ఓ కేంద్ర ప్రభుత్వ అధికారిని నియమిస్తామన్నారని ఆయన వెల్లడిరచారు. కిసాన్ మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు సర్వన్ సింగ్ పంథేర్ మాట్లాడుతూ కనీస మద్దతు ధరపైనే ప్రధానంగా చర్చించామని అన్నారు. ‘ఎంఎస్పీ చట్టం తెస్తే సమస్యలు వస్తాయని కేంద్ర మంత్రులు మాతో చెప్పారు కానీ అలా జరగుతుందని మేము అనుకోవడం లేదు. వినియోగదారులకు కానీ, వర్తకులకు గానీ ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు’ అని చెప్పారు. అయితే చర్చలు కొనసాగాలని కేంద్రం భావిస్తున్నందున తాము ముందుకెళుతున్నట్లు తెలిపారు. కేంద్రం సమయం కోరుతోందని, ఇబ్బందులు ఉన్నాయని చెబుతోందని అన్నారు. కేంద్ర మంత్రులు కోరినట్లుగా వారికి సమయం ఇచ్చామని పంధేర్ అన్నారు. అలాగే, వ్యవసాయోత్పత్తులపై దిగుమతి సుంకాన్నీ లెవీ చేయొద్దని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తుండటంపై సమావేశంలో ప్రస్తావించగా, అవన్నీ వదంతులు అని చౌహాన్ చెప్పారని తెలిపారు. రైతు నేత అభిమన్యు కోహర్ మాట్లాడుతూ ‘ రైతులు సమకూర్చిన డేటాను మంత్రిత్వశాఖ అధ్యయనం చేసినట్లు సమావేశం ఆరంభంలోనే చౌహాన్ చెప్పారు. దాదాపు మూడు గంటు ఎంఎస్పీపైనే చర్చించాం. రైతులకు రుణ మాఫీ గురించి ప్రస్తావించాం. మంత్రిత్వస్థాయి అంతర్గతచర్చలు దీనిపై జరగాలని మంత్రులు చెప్పారు. దిగుమతి సుంకాల విషయంలో అమెరికాకు తలొగ్గబోమని కూడా చౌహాన్ హామీనిచ్చారు’ అని అన్నారు. మరొక రైతు నాయకుడు కాకా సింగ్ కోట్డా మాట్లాడుతూ పంజాబ్ సరిహద్దుల్లో భద్రత పెంచడాన్ని పంజాబ్ మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ‘శంభు, ఖనౌరీ సరిహద్దులకు వందల మంది రైతులు చేరుకుంటున్నారు. ప్రభుత్వం ఏదో చేయాలనుకున్నది కానీ ఇప్పుడు వెనక్కు తగ్గింది. డ్రగ్ స్మగ్లర్లపై చర్చలు తీసుకుంటుండటం వల్లనే సరిహద్దుల వద్ద భద్రతను పెంచినట్లు మంత్రులు చెప్పారు’ అని ఆయనన్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, పంజాబ్ మంత్రులు గుర్మీత్ సింగ్ ఖుడ్డియన్, లాల్ చంద్, సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) తరపున 28 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ అంబులెన్స్‌లో సభాస్థలికి చేరుకున్నారు. ఈ సమావేశం నుంచి సానుకూల పరిణామాన్ని ఆశిస్తున్నట్లు వెల్లడిరచారు. కాగా, గతేడాది నవంబరు 26 నుంచి ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నారు.