Homeజిల్లాలుఅనంతపురంఅనంతపురంలో కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి... సిపిఐ నేత జగదీష్

అనంతపురంలో కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి… సిపిఐ నేత జగదీష్

- Advertisement -

విశాలాంధ్ర-అనంతపురం: అనంతపురం జిల్లాలో రైతులు పండిస్తున్న పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు వేగంగా రవాణా చేసేందుకు కార్గో విమానాశ్రయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ డిమాండ్ చేశారు.సోమవారం అనంతపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, శ్రీరాములు, కేశవరెడ్డి, గోపాల్, సంజీవప్ప తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా వివిధ రకాల పండ్లను పండించే జిల్లాల్లో అనంతపురం ఒకటని అన్నారు. అయితే రవాణా సౌకర్యాల లేమి, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రి పార్థసారథి తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారని తెలిపారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి పురోగతి చూపడం లేదని విమర్శించారు.

కార్గో విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించలేదని పేర్కొన్న జగదీష్, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే భూసేకరణ చేపట్టి కార్గో విమానాశ్రయ నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు