విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ప్రభుత్వ భూములను కాజేసిన మాజీ వీఆర్వో మహబూబ్ పటేల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ సోమవారం పెద్దకడబూరులోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో సిపిఐ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ లలిత కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కమిటీ సభ్యులు రాజు, సహాయ కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కల్లుకుంట గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 514 భూమిలో నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే మాజీ వీఆర్వో మహబూబ్ పటేల్ నిరుపేదలను మోసం చేసి పెత్తందార్లకు భూమిని కట్టబెట్టారాని ఆరోపించారు. ఇలా గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి అమ్ముకొని అక్రమంగా డబ్బులు సంపాదించినారన్నారు. నిరుపేదలైన దళితులు భూమి లేక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే మాజీ వీఆర్వో మహబూబ్ పటేల్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి, దళితులను సాగుబడిలోకి పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు మాదిగ చిన్నన్న, మాదిగ మల్లెమ్మ, మాదిగ అబ్రహం,మాదిగ సుందరం చాకలి బతకన్న, బోయ ఉసేని, వడ్డే గంగన్న తదితరులు పాల్గొన్నారు.


