రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
విశాలాంధ్ర – నిడదవోలు :
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుండి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులేనని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో పీ4పై సమీక్షలో భాగంగా జరిగిన సమావేశంలోమంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. మహిళలు నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ తదితర 5 కేటగిరి బస్సుల్లో ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించ వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజలందరికీ మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అదే విధంగా రూ.4 వేలకు పెన్షన్ల పెంపు చేపట్టడం కూటమి ప్రభుత్వ సాహసోపేత నిర్ణయంగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు.కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్ధీన్, కౌన్సిలర్లు నిడదవోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె. సతీష్, పెరవలి మండల ప్రత్యేక అదికారి ఎం.సునీల్ వినయ్, నిడదవోలు మండల ఎంపీడీవో వీఎస్ వీఎల్ జగన్నాధ రావు, మున్సిపల్ కమిషనర్ తోటా శ్రీకృష్ణవేణి, నిడదవోలు మండల తహశీల్దార్ బి.నాగరాజు నాయక్, ఉండ్రాజవరం మండల ఎంపీడీవో వీ.వీ.వీ.ఎస్ రామారావు, ఉండ్రాజవరం మండల తహశీల్దార్ పీఎన్ డీ ప్రసాద్, పెరవలి మండల ఎంపీడీవో గంటా శ్రీనివాసు,పెరవలి మండల తహశీల్దార్ కె.నిరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు నిడదవోలు పోలిరెడ్డి వెంకటరత్నం, ఉండ్రాజవరం కె.సత్యనారాయణ (బాలాజి), నిడదవోలు రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.


