‚ధ్రువీకరించిన అమెరికా సెంట్రల్ కమాండ్
అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ తాజాగా పశ్చిమాసియాకు చేరుకుంది. దీంతో ఇరాన్‌పై యూఎస్ ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. అబ్రహం లింకన్‌తో పాటు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం దీన్ని మోహరించినట్లు పేర్కొంది. ఈ బృందం ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా.. హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలతో ఈ ప్రాంతంలో అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య మరింత పెరిగింది. ఇదిలాఉండగా.. పెంటగాన్ పలు ఫైటర్ జెట్‌లు, మిలిటరీ కార్గో విమానాలను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ . వారికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భారీగా తమ సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపినట్లు ప్రకటించారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
చర్చలకు సిద్ధం..
ఇరాన్ చర్చించాలనుకుంటే అమెరికా అందుకు సిద్ధంగా ఉందని అగ్రరాజ్యానికి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. చర్చలు ముందుకుసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టెహ్రాన్‌కు ఇప్పటికే తెలుసని అన్నారు.


