Homeఅమెరికా భీకర దాడులు

అమెరికా భీకర దాడులు

- Advertisement -

. దీటుగా స్పందించిన ఇరాన్
. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై క్షిపణులు, డ్రోన్లతో దాడి
. ‘హోర్మూజ్’లో అమెరికా జోక్యాన్ని సహించబోమని హెచ్చరిక
. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తుండటంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగిస్తుండగా… మరోవైపు ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌పై అమెరికా గురువారం తెల్లవారుజామున తొలిసారిగా తెహ్రాన్ పరిసరాలతో పాటు ఉత్తర ఇరాన్‌లోని అనేక సైనిక లక్ష్యాలపై దాడులు జరిపింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందన్న నెపంతో ఖర్గ చమురు టెర్మినల్ వైపు వెళ్తున్న ఓ చమురు ట్యాంకర్‌ను కూడా అమెరికా సైన్యం క్షిపణి దాడితో ధ్వంసం చేసింది. కాగా, అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా స్పందించింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ప్రాంతీయ మౌలిక వసతులపై భారీ దాడులకు వెనుకాడబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. హోర్మూజ్ జలసంధిలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని… అది తమకు ‘అధిగమించలేని రెడ్ లైన్’ అని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల కాలంలో అమెరికా దాడుల్లో 35 మందికిపైగా మరణించగా, 300 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. సెమ్నాన్, హమదాన్, హోర్మోజ్గాన్, ఖుజెస్తాన్, లోరెస్తాన్, సిస్తాన్-బలూచిస్తాన్ తదితర ప్రాంతాల్లో కూడా అమెరికా వైమానిక దాడులు జరిగాయి. కాగా, తెహ్రాన్, పకాÝష్ట్, పర్చిన్ ప్రాంతాల్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని ఇరాన్ అధికారులు తెలిపారు. సెమ్నాన్ విమానాశ్రయంపై దాడి జరిగినప్పటికీ, పెద్దగా ప్రాణనష్టం జరగలేదని, కొన్ని నిర్మాణాలు మాత్రమే దెబ్బతిన్నాయని వెల్లడించారు. హోర్మూజ్ జలసంధిపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనతో పశ్చిమాసియాలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం ముప్పు నెలకొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరుకుంది. అయితే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడిని మరింత పెంచుతూ ఇరాన్‌కు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేస్తూ, వాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరించారు.
సైనిక శిబిరాలే లక్ష్యంగా అమెరికా దాడులు
అమెరికా సైన్యం 24 గంటల్లో మూడో విడత వైమానిక దాడులను నిర్వహించింది. ఇరాన్ సైన్యానికి చెందిన అనేక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించింది. ఇదే సమయంలో సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని 388వ మెకనైజ్¦ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ శిబిరంపై జరిగిన దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మృతి చెందగా, అనేకమంది గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఓడరేవు వైపు వెళ్తున్న ఓ చమురు ట్యాంకర్‌ను హెల్ఫైర్ క్షిపణితో అడ్డుకున్నామని, మరో రెండు నౌకలను దారి మళ్లించినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ లైట్నింగ్’లో భాగంగా కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించాయి. కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్‌లో అమెరికా రాడార్ వ్యవస్థలు, పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌లు, ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడులు నిర్వహించి కమ్యూనికేషన్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ క్షిపణులు కూల్చివేశాం:జోర్డాన్
తమ గగనతలంలోకి ప్రవేశించిన ఎనిమిది ఇరాన్ క్షిపణులను తమ వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు జోర్డాన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు, నైరుతి ఇరాన్‌లోని అండిమేష్క్క ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎంక్యూ`9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం
ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తోంది. హోర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇరాన్ యేతర వాణిజ్య నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సముద్ర వాణిజ్య సంస్థలు పేర్కొంటున్నాయి. అనేక నౌకలు తమ గుర్తింపును వెల్లడించే ట్రాన్స్పాండర్లను నిలిపివేసి “డార్క్ ట్రాన్సిట్” విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.
ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుదల
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85.28 డాలర్లకు చేరుకోవడంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
100 మంది అమెరికా సైనికులను కిడ్నాప్ చేయాలి: ఇరాన్ మాజీ మంత్రి వ్యాఖ్యలు
100 మంది అమెరికా సైనికులను కిడ్నాప్ చేయాలని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు మనుచెహర్ మొత్తకి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఆక్రమించి… బంధించిన సైనికుల్ని ఇరాన్ తీసుకురావాలని సైన్యానికి సూచించారు. ఇందుకోసం భూతల దాడులు చేయాలని వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతంలోనూ మనుచెహర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
అయతుల్లా అలీ ఖామేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాతో అవగాహన ఒప్పందం ఒక మోసపూరిత ప్రణాళికగా అభివర్ణించారు. “ఇస్లామాబాద్‌లో చర్చలు అంతా ఒక పథకం ప్రకారం అమెరికా పన్నిన కుట్ర. రెండు మూడు రోజుల్లో తమ ప్రణాళికను పూర్తిచేసి, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ముగింపు పలికేస్తామని భావించారు. కానీ పూర్తిగా విఫలమయ్యారు” అని విమర్శలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు