విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలం, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్ర కుమార్ , పాఠశాల చైర్మన్ అనంత రాముడు, డైరెక్టర్ రమేష్ నాయుడు, కళా రత్న, కవి బిక్కీ కృష్ణ తో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చిన్నారులు దైవ స్వరూపులు..
చిన్నారులు దైవ స్వరూపులు, నిస్వార్థ, ప్రేమ ఆప్యాయత, అనురాగాలను పంచే భగవంతుని స్వరూపం చిన్నారులని జస్టిస్ బి. చంద్ర కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.చైర్మన్ అనంత రాముడు మాట్లాడుతూ, పాఠశాల సాధించిన ప్రగతిని, విద్యార్థుల విజయాలను వివరించారు.వైస్ చైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ . విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను తన ప్రసంగంలో పేర్కొన్నారు.వార్షికోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. వివిధ రకాల డ్యాన్స్ స్క్రిప్ట్స్, జానపద మరియు వెస్ట్రన్ నృత్యాలతో విద్యార్థులు ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, అతిథులు కరతాళ ధ్వనులతో అభినందించారు. చివరగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల సి ఏ ఓ నరసింహారావు, ప్రిన్సిపాల్ షాలిని కె వి, ఉపాధ్యాయ బృందం , పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.


