Saturday, November 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలి..

ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలి..

- Advertisement -

మండల విద్యాధికారులు

విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించి , ప్రతీ అంశాన్ని పరిశీలనాత్మకంగా , హేతుబద్దంగా చూడాలని మండల విద్యాధికారులు రాజేశ్వరేదేవి , గోపాల్ నాయక్ లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాల్లో ముఖ్య అతిథితులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలన్నారు. చెకుముకి సైన్సు సంబరాల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.సైన్సు లేనిదే ఈ భూమి మీద మానవుని మనుగడ సాధ్యం కాదని సైన్సు ను ప్రతి ఒక్కరూ హక్కు గా భావించాలన్నారు, సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే సైన్సు ను ప్రచారం చేయడంలో జెవివి కృషి అభినందనీయమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ చేతబడి, బాణామతి పేరుతో అమాయకులను చంపేస్తున్నారంటే దానికి కారణం మూఢనమ్మకాలేనన్నారు.
దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం, కరువు కాటకాలు పోయి దేశ ప్రజల్లో గుణాత్మక మార్పు రావాలంటే ఒక్క సైన్సు అభివృద్ధితోనే సాధ్యం అన్నారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 51 – ఏ అధికరణంలో పొందుపరిచిన విధంగా ప్రతి పౌరునిలోనూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. సమస్యకు మూల కారణం తెలుసుకుంటే పరిష్కారం కూడా దొరుకుతుందని ఏ సమస్య వచ్చినా అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసం తో ముందుకు పోవాలన్నారు. మన దేశంలో సైన్స్ పరిశోధనలకు కేటాయించే అరకొర నిధుల కారణంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతుందన్నారు, విశ్వవిద్యాలయాలలో హేతు విరుద్ధమైన వాస్తు,జ్యోతిష్యం, భూతవైద్యం వంటి శాస్త్రాలను అధికారికంగా బోధిస్తూ వాటిలో మాస్టర్స్ డిగ్రీలను ప్రధానం చేయడం ద్వారవిద్యార్థుల్లో చిన్నతనం నుండే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సింది పోయి, అశాస్త్రీయ భావజాలాన్ని పుంకాలుగా పుంకాలుగా వ్యాప్తి చేస్తున్నారన్నారు.
చిగిచెర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్మారెడ్డి మాట్లాడుతూ 130 కోట్ల దేశ జనాభాలో ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారు కావాల్సి ఉన్నా సి వి రామన్ తరువాత ఒక్కరికి కూడా సైన్స్ రంగంలో నోబుల్ బహుమతి రాకపోవడం బాధాకరమన్నారు .
జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చెయ్యాల్సిన ప్రభుత్వాలే మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తూ, శాస్త్ర వేత్తలను అవమానపరుస్తూ ప్రజల్ని అయోమయం లోకి నెట్టేయడమే కాకుండా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ లాంటి వాటిల్లో కూడా నాన్ సైన్స్ ను చర్చిస్తూ ఇతర దేశాలు కూడా నవ్వుకునే లా ప్రవర్తించడం బాధాకరమన్నారు .
ఈ కార్యక్రమంలో యు టి ఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, జెవివి నాయకులు ఖలందర్, ఉపాధ్యాయులు శేఖర్, హరి ,రామకృష్ణ, గోవర్ధన్,మండలంలోని ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు