విశాలాంధ్ర–కళ్యాణదుర్గం టౌన్: కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయుడుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆదివారం కలకలం రేపింది. పొలంలో పనులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఎలుగుబంటి దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రైతును చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్యం అందుతున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో ఎలుగుబంట్ల సంచారం పెరిగిపోతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పంటపొలాలకు వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


