తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి ; స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి జిల్లా;నర్సీపట్నం: ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్పీకర్ దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి గారు స్వయంగా పొంగలి వండగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిల్లలకు గాలిపటాలను అందించి వారితో కలిసి సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆటలు, సోదమ్మ, కొయ్యదొర విన్యాసాలు మరియు వేంకటేశ్వర స్వామి వేషధారణలు, కొళాటం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని, మన సంస్కృతి మనతోనే ఆగిపోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు మన పండుగల విశిష్టతను వివరించాలని కోరారు. భాషా పరిరక్షణ గురించి మాట్లాడుతూ, పిల్లలు పాఠశాలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ, ఇంట్లో తల్లిదండ్రులు మరియు పెద్దలతో కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని హితవు పలికారు. మాతృభాషలో మాట్లాడితేనే అనుబంధాలు బలపడతాయని, అది మన పిల్లలకు నేర్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 14 వేల పంచాయతీల్లో ప్రతి గ్రామంలోనూ సంక్రాంతి సంబరాలను ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సతీమణి దివ్యశ్రీ వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పురప్రజలు, పిల్లలు పాల్గొన్నారు.


