లేనిపక్షంలో కూలీలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం..
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి.. చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ ధర్మవరం: ఉపాధి హామీ పథకం లో భాగంగా మండలంలోని కూలీలకు బకాయి పడ్డ బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో కూలీలతో కలిసి త్వరలోనే
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేస్తున్న కూలీలకు గత రెండు నెలలుగా ఒక పైసా కూడా బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మండలంలో స్థానికంగా నాయకుల మధ్య వర్గ విభేదాల నేపథ్యంలో ప్రారంభం నుంచి ఒకటి రెండు పంచాయతీలు మినహా, మిగిలిన అన్ని గ్రామాల్లోనూ గత రెండు మూడు నెలలు కిందటి వరకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు అని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరామ్ కూడా ఈ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి శ్రద్ధ చూపకపోవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించేవారు లేక కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత ఏడాదిగా మండలలో ఉపాధి హామీ పథకం పనులు స్తంభించి పోవడంతో గ్రామాల్లో
ఈ పథకం ద్వారా జరిగే వివిధ అభివృద్ధి పనులతో పాటు, రైతులు పండ్లతోటలు పెంచుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా పోయిందని ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎట్టకేలకు మండల వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించడంతో సంతోషంతో కూలీలు పనులకు వెళ్తున్న నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటి పోటుల ఈ రెండు నెలలు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో కూలీలు ఆవేదనకు అంతులేకుండా పోతుందని తెలిపారు. కనుక తక్షణమే ప్రభుత్వం మండలంలో ఉపాధి కూలీలకు బకాయి పడ్డ రెండు నెలల బిల్లులు మంజూరు చేయాలన్నారు. లేనిపక్షంలో త్వరలోనే కూలీలతో కలిసి పట్టణంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు.


