శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి)
విశాలాంధ్ర అనంతపురం : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రకటించిన కరువు మండలాలలో పర్యటించేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడానికి జనవరి 2, 3వ తేదీలలో జిల్లాలో ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం పర్యటన చేయనుందని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనవరి 2, 3వ తేదీలలో జిల్లాలో ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్- 2024లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 7 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లాలోని అనంతపురం, నార్పల, బుక్కరాయసముద్రం, రాప్తాడు, గార్లదిన్నె, యాడికి, విడపనకల్లు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించగా, కరువు సమయంలో పరిస్థితిని అంచనా వేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనుందని తెలిపారు. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం పర్యటన నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఆయా శాఖల అధికారులు అన్ని విధాల సన్నద్ధం కావాలన్నారు. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో వసతి, వాహనాలు ఏర్పాటు, నోట్స్ సిద్ధం చేయడం చేయాలని, ఫొటోస్ ద్వారా కరువు పరిస్థితిని చూపించడం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, వర్షపాతం, తదితర అన్ని రకాల వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ ఏర్పాట్లు, రూట్ మ్యాప్ తయారు చేయాలన్నారు. కరువు మండలాల్లో తాగునీటి సమస్యలు ఉంటే వారికి చూపించాలని, జల్ జీవన్ మిషన్ పనులు, ఉపాధి హామీ కింద లేబర్ బడ్జెట్ తయారీ, పనుల కల్పన, భూగర్భ జలాల పరిస్థితి తదితర వివరాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, రెండు రోజుల్లోగా ఇందుకు సంబంధించిన పిపిటి తయారు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర బృందం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మాలోల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, సిపిఓ అశోక్ కుమార్, డ్వామా పిడి సలీం భాష, ఏపీఎంఐపి పీడీ రఘునాథరెడ్డి, హార్టికల్చర్ డిడి నరసింహారావు, డిపిఎం ఆనంద్, ఐసిడిఎస్ పిడి వనజ అక్కమ్మ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, హెచ్.ఎల్.సి ఎస్ఈ రాజశేఖర్, గ్రౌండ్ వాటర్ ఎడి జయరామిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.