ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం
జిల్లా ఎస్పీ పి.జగదీష్ పిలుపు
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం 62 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. ఈసందర్భంగ ఎస్పీ మాట్లాడుతూ… 1940 దశకంలో వలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీసుశాఖలో కీలకంగా ఉంటుందన్నారు . హోంగార్డులు పోలీసుశాఖలో అంతర్భాగం అని తెలిపారు. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తుండటం అభినందనీయం అన్నారు. సాధారణ డ్యూటీల మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పని చేస్తున్నారన్నారు. పోలీసులకు ఏమాత్రం తీసిపోని విధంగా డ్రైవర్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణ, కంప్యూటర్ ఆపరేటింగ్… ఇలా చాలా రకాల విధుల్లో హోంగార్డుల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. పోలీసుశాఖ మంచి పని తీరుకు మీ తోడ్పాటు ఉండటం అభినందనీయం. పనికి తగ్గట్టు రివార్డులు, ప్రశంసలు ఉంటున్నాయి అని పేర్కొన్నారు . జిల్లాలో పోలీసులతో పాటు హోంగార్డుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. మునుపెన్నడూ లేని విధంగా పోలీసులతో పాటు హోంగార్డుల పిల్లల చదువుల ప్రోత్సాహంలో భాగంగా మెరిట్ స్కాలర్ షిప్పులు అందజేశాము అన్నారు. పోలీసు యూనిఫాం ధరిస్తున్నందుకు మనమంతా గర్వపడాలన్నారు. పోలీసుశాఖ ప్రతిష్ట పెరిగేలా సమిష్టిగా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేకించి హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దర్భార్ నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీసుశాఖ వడ్డీ లేకుండా హోంగార్డులకు ఇచ్చే రుణాలను అధికం చేయాలని, కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరహాలో పి.ఎఫ్ వర్తింపజేయాలని, పదవీ విరమణ పొందేరోజున మిగితా హోంగార్డుల శాలరీ నుండీ ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఐ.డి కార్డులు జారీ చేయాలని… ఇలా వివిధ సమస్యలపై పిటీషన్లు ఇచ్చారు. ఈ సమస్యలన్నింటినీ సమగ్రంగా విని సాధ్యాసాధ్యాలను బట్టి త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేష్, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సి.ఐ లు శ్రీకాంత్, శేఖర్, ఆర్ ఐ రాముడు, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, మగ్బూల్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, లక్ష్మినారాయణ, ఆనంద్, మసూద్, రిపీటర్ నాగరాజు, జిల్లాలోని హోంగార్డులు, ఏ.ఆర్ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి విధులు నిర్వర్తిద్దాం…
రెవెన్యూ సదస్సులు
రైతులందరూ సద్వినియోగం చేసుకోండి
తాసిల్దార్ పేర్లి శ్యాం ప్రసాద్
విశాలాంధ్ర- ఆనందపురం (విశాఖ జిల్లా ) : ఆనందపురం మండలంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాల పరిధిలోని రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీక రించేందుకు ఈ నెల 6 నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వ హించనున్నట్లు తహసీల్దార్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ సద స్సులలో అన్ని రకాల భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిసా మన్నారు.తహసీల్దారు లేదా ఆస్థాయి అధికారులుసదస్సులలో పాల్గొంటారు. రెవిన్యూ గ్రామ సదస్సులలో ఇచ్చే వినతులు, ఫిర్యాదులపై 45 రోజుల్లో పరిష్కారాలను చూపిస్తారు. అలాగే సర్వే రాళ్లపై గతంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ బొమ్మలను తొలగించివేయడానికి చర్యలు తీసుకుంటారు.
ఈనెల 6 న గొట్టిపల్లి, 7 న కుసులువాడ, 9 న గిడిజాల 10 న ఆనందపురం, 11 న రామవరం, 12 న దబ్బంద, 13 న కనమాం, గోరంట 16 న ఎన్ జి ఆర్ పురం – 2, 17 న ఎన్ జి ఆర్ పురం-2,18 న భీమన్నదొరపాలెం, 19 న కోలవానిపాలెం, 20 న పాలవలస, 21 న పందలపాక, బాకురుపాలెం రెవెన్యూ గ్రామాలలో సదస్సులు ఉంటాయి. అలాగే 23 న గుడిలోవ 27 నతర్లువాడ, 28 న చందక, 30 న జగన్నాధపురం, 31 న ముకుం దపురం, పేకేరు జనవరి 2 న అనందపురం, 3 న పెద్దిపాలెం, వెల్లంకి 4 న గండిగుండం, 6 న గంభీరం, 7 న తంగుడిబిల్లి, ముచ్చర్ల 8 న శిర్లపాలెం, బోని గ్రామాలలో రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహించి బడునని తహసిల్దార్ తెలిపారు.
మైక్రోసాఫ్ట్ కంపెనీ నందిగామలో 25 ఎకరాలలో విస్తరించనుందా…?
విశాలాంధ్ర- నందిగామ :-ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ కంపెనీ వ్యాపారాల ను అమరావతి ప్రాంతంలో విస్తరించనుందా అంటే వారు వేస్తున్న అడుగులను బట్టి అవుననే చెప్పవచ్చు ఇటీవల అమరావతి సి ఆర్ డి ఏ ప్రాంతంలో గల ప్రముఖ పట్టణం నందిగామ నందు సుమారు 25 ఎకరాల భూమిని 181 కోట్ల రూపాయల ను వెచ్చించి కొనుగోలు చేసినట్టుగా ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక వెబ్సైట్ నందు పొందుపరిచిన దాన్ని బట్టి చెప్పవచ్చు ఒకవేళ అదే జరిగితే నందిగామ పరిసర ప్రాంతాలలో అత్యధికంగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా వ్యాపారవేత్తల పేర్కొంటున్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో చెవిటికల్లు వద్ద నిర్మాణం తలపెట్టిన ఐకాన్ బ్రిడ్జి గాని పూర్తయితే నందిగామ కు మంచి మహర్దశ వచ్చే అవకాశం ఉంది కారణమేమంటే ఇటు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గంలో నేషనల్ హైవే కి అనుసంధానంగా ఉన్న ప్రముఖ పట్టణంగా పేరొందిన నందిగామ సాఫ్ట్వేర్ కంపెనీకి అనుకూలమైన పరిస్థితులు కలవు ఒకవేళ నందిగామ ను ఎంచుకుంటే నందిగామ నుండి ఐకాన్ బ్రిడ్జి ద్వారా అమరావతికి చేరుకోవాలంటే కేవలం 35 కిలోమీటర్ల దూరంలో అమరావతి సచివాలయం కలదు.ఇటు విజయవాడ వెళ్లాలన్న 50 కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో నందిగామ ఉంది అలాగే హైదరాబాద్ చేరుకోవాలంటే ఆరు లైన్ల రోడ్డు ఇటీవల కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయడానికి మొదలుపెట్టిన నేషనల్ హైవే రోడ్డు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ కేవలం 3 గంటల ప్రయాణం తో హైదరాబాద్ చేరుకోవచ్చు కాబట్టే మైక్రోసాఫ్ట్ కంపెనీ లాంటి దిగ్గజమైన సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం నందిగామ వైపు చూస్తున్నాయి అనేది మాత్రం ప్రస్తుతం చెప్పుకోదగ్గ విషయమే ఏది ఏమైనా గాని నందిగామ అన్ని రంగాలలో ముందుకు పోతున్న సందర్భంలో సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది నందిగామకు వస్తే లక్షలాది మంది జీవనోపాధి లభిస్తుందని పలువురు ఆనందిస్తున్నారు…
శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి
విశాలాంధ్ర-పామిడి : అనంతపురం జిల్లా సింగలమల మండల పరిధిలోని కల్లుమడి గ్రామం దళిత వాడలో గురువారం నిర్వహించిన విశాలాంధ్ర విలేఖరి నరేష్ భార్య సుమలత సీమంతంకు టిడిపి పార్టీ కార్యకర్తల సీనియర్ నాయకుడు పాత్రికేయులు నడుమ అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి పాల్గొన్నారు. కల్లుమడి ఓబిరెడ్డి దంపతులను శుభాకాంక్షలు తెలిపారు.ఈ శ్రీమంత కార్యక్రమానికి శంకర్, రాజశేఖర్, సురేష్, మల్లికార్జున, పలువురు సీనియర్ రిపోర్టర్లు తులసీరామ్,సుబ్రహ్మణ్య ఆచారి, బోయ నవీన్ కుమార్, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితర సీనియర్ రిపోర్టర్లు పాత్రికేయులు పాల్గొన్నారు.
కవిత, హరీశ్ రావు హౌస్ అరెస్ట్
బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారి నివాసాల నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను గృహనిర్బంధం చేశారు. కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డికి నిన్న అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అంబేద్కర్ సేవలను స్మరించుకున్న చంద్రబాబు,జగన్
బాబా సాహేబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.అలాగే బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు ఆజన్మాంతం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని అన్నారు. . భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారని ప్రశంసించారు.. భావితరాలకు స్ఫూర్తి దాతగా నిలిచారన్నారు. దళిత జాతి తలెత్తుకుని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ అంబేద్కర్ ప్రాత:స్మరణీయుడని అన్నారు.. ఆయన చూపిన బాటలో, చేసిన బాసతో నిరంతరంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారుౌ
జగన్ నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్దంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు వరికూటి అశోక్‌బాబు, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.
డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ.. చంద్రబాబు
ప్రస్తుతం డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖపట్నంలో నేషనల్ డిప్ టెక్ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పారిశ్రామిక రంగాల్లో అత్యాధునిక మార్పుపై ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, డోలా వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఎన్టీఆర్ భవన్ ప్రజలను కలిశారు. వినతులను స్వీకరించారు. సమస్యలను పరిస్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటన
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశం ఇవాళ (శుక్రవారం) ముగిసింది. వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ కమిటీ నిర్ణయించింది. 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రతి రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా మే 2022 నుంచి వరుసగా ఆరుసార్లు కలిపి మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటుని ఆర్బీఐ పెంచింది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెపో రేటుని పెంచలేదు. కాగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
మందగించిన వృద్ధి
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి పేలవంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతంగా నమోదైందని పేర్కొంది.
బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. కరెన్సీ నోట్లపై ఆ దేశ జాతిపిత బొమ్మ తొలగింపు!
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ బొమ్మలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త నోట్లను ముద్రిస్తున్న బంగ్లాదేశ్ బ్యాంక్.. షేక్ హసీనా భారత్ పారిపోవడానికి కారణమైన జులై తిరుగుబాటును ప్రతిబింబించేలా ఫొటోలను ముద్రిస్తున్నట్టు ాఢాకా ట్రిబ్యూన్్ణ పేర్కొంది. ఆగస్టు 5న షేక్ హసీనా భారత్‌కు పారిపోయిన తర్వాత దేశ మధ్యంతర ప్రభుత్వంలో చీఫ్ అడ్వైజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ బాధ్యతలు చేపట్టారు. మధ్యంతర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20, 100, 500, 1000 టాకాల నోట్లను ముద్రిస్తున్నట్టు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే, ఈ నోట్లపై బంగ్లాదేశ్ బంగబంధు (జాతిపిత) షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఫొటో ఉండదని దినపత్రిక పేర్కొంది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, జులై తిరుగుబాటు సమయంలో గీసిన ాగ్రాఫిటీ్ణని చేర్చినట్టు తెలిసింది. మరో ఆరు నెలల్లో ఈ కొత్త నోట్లకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని బంగ్లాదేశ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హస్నీరా షేక్ తెలిపారు. ప్రస్తుతానికైనా పైన పేర్కొన్న నాలుగు నోట్ల డిజైన్ మార్చామని, దశల వారీగా మిగతా నోట్లను కూడా రీడిజైన్ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ధర్మవరం నందు రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు
ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరంలో 35 కోట్ల విలువైన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం ప్రధాన కేంద్రంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది అని అన్నారు.ఇది ధర్మవరం చేనేత రంగానికి గొప్ప ఆశీర్వాదం అని,ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇలాంటి ప్రాజెక్ట్ ధర్మవరంలో ప్రారంభం,ఇది మన అందరికి గర్వకారణం అని తెలిపారు.ఈ క్లస్టర్, 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటూ చేస్తారని ఇది నోడల్ సెంటర్‌గా పని చేస్తుంది అని తెలిపారు. తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.. ఈ సర్వే ఆధారంగా వివరమైన ప్రాజెక్ట్ నివేదిక ఈ క్లస్టర్ కు రూపొందించబడుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విశ్వజిత్ , జి. నాగేశ్వరరావు , టెక్నికల్ సూపర్‌వైజర్‌లు , హ్యాండ్‌లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ హాజరై బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. తదుపరి ఎంపీడీవో ఈ ప్రాజెక్ట్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ధర్మవరం చేనేత రంగానికి ప్రాచీన గౌరవాన్ని పునరుద్ధరిస్తుందని, పట్టు పరిశ్రమకు మరింత కీర్తి ని తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాబోయే అభివృద్ధి కి ఇది మొదటి ఘట్టం గా తెలిపారు.

