Home Blog Page 1498

‘రుషికొండ’ మంటలు

0

. శారదా పీఠం భూములు, మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై రగడ
. మంత్రులు`వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం
. గురుదక్షిణ కోసమే భూముల కేటాయింపు: అచ్చెన్నాయుడు
. టీడీపీ హయాంలో భూములెలా ఇచ్చారు: బొత్స

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలిలో మంగళవారం కూడా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వాడీవేడిగా మాటల దాడి కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ పర్యాటక కేంద్రం, మదనపల్లిలో భూ రికార్డుల దగ్ధం, శారదా పీఠానికి భూముల కేటాయింపు అంశాలపై మంత్రులు, వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో పరస్పర విమర్శలకు దిగారు. దీంతో మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎప్పటికప్పుడు చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు సర్దిచెప్పినప్పటికీ…ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. మదనపల్లెలో భూ రికార్డుల దగ్ధం అంశంపై సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బదులిస్తూ… ఈ కేసు విచారణ పురోగతిలో ఉందని, ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నామని, రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీజేశామన్నారు. సభ్యుడు రామారావు మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో మదనపల్లెలో ఫ్రీ హోల్డ్‌ కింద ఎన్ని అసైన్డ్‌ భూములను గుర్తించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..గత వైసీపీ ప్రభుత్వ అవినీతి బయటకు వస్తుందన్న నెపంతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులను ధ్వంసం చేశారని మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ దందాలు ఎక్కడ బయటపడతాయోననే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రస్తావించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో చైర్మన్‌ జోక్యం చేసుకుని పేర్లు లేకుండా మాట్లాడాలని మంత్రికి సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…రెవెన్యూ మంత్రి ఇచ్చే వివరణను వినకుండా వైసీపీ సభ్యులు నిరసనకు దిగి, గందరగోళం సృష్టించడం తగదన్నారు. మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… విచారించాకే..ఎవరైనా పేర్లు ఉంటే వెల్లడిరచాలని సూచించారు. అదే జరిగితే చంద్రబాబు పేరూ వస్తుందన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, 2,443 ఫైళ్ల దగ్ధం అయ్యాయని, ఈ కేసులో ఎంతటివారున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమిలిలోని శారదా పీఠానికి భూముల కేటాయింపుపైనా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ప్రశ్నలపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బదులిచ్చారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసినట్లు తెలిపారు. సభ్యుడు రామారావు మాట్లాడుతూ… అడ్డగోలుగా అనేక అవకతవకలతో శారదా పీఠానికి భూములు కేటాయించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని రద్దు చేసిందన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి జగన్‌ గురు దక్షిణగా శారదా పీఠానికి భూములు ఇచ్చారని వ్యాఖ్యానించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 300 కోట్లు విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే ఇవ్వడం చాలా దారుణమని మంత్రి అనగాని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నిబంధనలను అతిక్రమించి ఇచ్చారనే తాము గురుదక్షిణ అని అంటున్నామని ఎద్దేవా చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ధార్మిక సంస్థలకు భూములు కేటాయించడం ఆనవాయితీగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ కొన్ని సంస్థలకు భూములు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. గురుదక్షిణ అనే పదం సమంజసం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం మేం ఇవ్వకుంటే మీరు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజా సొమ్ము దుర్వినియోగం: పర్యాటక మంత్రి దుర్గేశ్‌
విశాఖపట్నంలోని రుషికొండ అంశంపైనా మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర విమర్శలకు దిగారు. పర్యాటక అంశంపై సభ్యుడు దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేశ్‌ ఘాటుగా సమాధానం ఇవ్వగా…వైసీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుకున్నారు. నిర్మాణంతో రుషికొండ బీచ్‌కు ఆటంకం కలిగించారని, రిసార్ట్స్‌ నిర్మిస్తామని చెప్పి, ప్యాలెస్‌ను నిర్మించారని విమర్శించారు. వారు గదులు కడతామని చెప్పి, ఏడు బ్లాక్‌లుగా నిర్మించారని, అందులో ఉపయోగపడేదీ కేవలం మూడు బ్లాక్‌లేనని తెలిపారు. చివరగా దీనిని ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్‌ ఆఫీస్‌ అని, మంత్రుల కోసం అని ఉత్తర్వులు జారీజేశారని, వాటిని మండలిలో చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 58 గదులతో ఉన్న హరితా రిసార్ట్స్‌ను కూలగొట్టి, ఇంతకంటే మంచి రిసార్ట్స్‌ తీసుకొస్తామని అప్రూవుల్‌ తీసుకుని, ఆ తర్వాత రుషికొండలో ఖరీదైన ఏడు గదులతో నిర్మించారని వివరించారు. ఇక్కడ ప్రజల డబ్బు దుర్వినియోగమైందని మంత్రి దుర్గేశ్‌ వ్యాఖ్యానించారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రుషికొండను వైసీపీ సభ్యులు చూస్తే ఇలా వారు కూడా మాట్లాడరని చెప్పారు. ఎస్‌ఎఫ్‌టీ రూ.6వేల తో కట్టిన శాసనసభ గురించి నాడు ఐదు రోజులపాటు వైసీపీ సభ్యులు గగ్గోలు పెట్టారని… అదే రుషికొండ నిర్మాణానికి ఎస్‌ఎఫ్‌టీకి రూ.28వేలు ఖర్చు చేశారన్నారు. కళ్లముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే..వైసీపీ సభ్యులు సిగ్గుపడాలన్నారు. దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2017లో నిర్మించినప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్‌ఎఫ్‌టీ రూ.14వేలు(ఫర్నీచర్‌తో కలిపి) అని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు తప్పుడు అంకెలు చెబుతున్నారన్నారన్నారు. రుషికొండలోని నిర్మాణాలు ప్రభుత్వం పరంగా జరిగాయని, వాటిని ప్రభుత్వం వేటికైనా వినియోగించుకోవచ్చని చెప్పారు. అక్కడ అవినీతి జరిగితే దానిపై విచారించాలని కోరారు. మండలిలో ‘దమ్ముందా, సిగ్గుపడాలి, రండి చూసుకుందాం’ అనే మాటలను మంత్రి దుర్గేశ్‌ మాట్లాడటం తగదన్నారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ, దీనిపై చర్చకు రావాలని సూచించారు.

మోదీ రైతు వ్యతిరేక అజెండా

0

రాజన్‌ క్షీరసాగర్‌

బీజేపీ ప్రభుత్వం ‘వినాశకర వ్యవసాయ చట్టాలు’ తిరిగి ప్రవేశపెట్టేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. రైతుల వ్యతిరేకత, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చినప్పటికీ బీజేపీ ఎంపీలు అనేక మంది ఈ వినాశకర నల్లచట్టాలను బహిరంగంగా సమర్థిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోదీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ తగ్గిపోవడానికి ప్రధాన కారణం. మెజారిటీ తగ్గినప్పటికీ జేడీయూ, టీడీపీ మద్దతుతో బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగు తోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్‌ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బీజేపీ కొనసాగిస్తోంది.
కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో బీజేపీ ప్రభుత్వం ‘వినాశకర వ్యవసాయ చట్టాలు’ తిరిగి ప్రవేశపెట్టేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. రైతుల వ్యతిరేకత, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చినప్పటికీ బీజేపీ ఎంపీలు అనేక మంది ఈ వినాశకర నల్లచట్టాలను బహిరంగంగా సమర్థిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరో పక్క ఈ వివాదాస్పద చట్టాలను తిరిగి తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ బహుళజాతి వ్యవసాయ కార్పొరేషన్లతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. ‘‘డిజిటల్‌ మౌలిక సదుపాయాల’ ప్రచారం ద్వారా వ్యవసాయ డేటాపై నియంత్రణను ప్రభుత్వం కోరుకుంటోంది. ఐసీఏఆర్‌, అమజాన్‌, సింజెంటా వంటి కంపెనీల మధ్య ఈ విధమైన ఒప్పందాల ద్వారా ప్రపంచ సంస్థలకు అందుబాటులో ఉంటోంది. ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన డేటా, విస్తరణ డేటా చివరకు భూమిని కూడా ఈ సంస్థలకు ధారాదత్తం చేయడానికి దోహదపడుతోంది. అంతేకాకుండా భారతీయ వ్యవసాయం కార్పొరేట్ల నియంత్రణలోకి వెళ్లిపోతోంది.
వరదలు, కరువు ప్రభావిత ప్రాంతాల నిర్లక్ష్యం
ఖరీఫ్‌ సీజన్‌లో దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించి లక్షలాది ఎకరాలలో పంట నాశనమైనది. మరి కొన్ని ప్రాంతాలలో దుర్భిక్ష పరిస్థితులు పంట నష్టానికి దారితీశాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన ‘రుతుపవనాల ముగింపు నివేదిక’ ప్రకారం 2024లో 2,632 ప్రాంతాలలో భారీ వర్షాలు, 473 ప్రాంతాలలో అతి భారీవర్షాలు కురిశాయి. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి గురై కొండచెరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌, అసోం, ఉత్తర ప్రదేశ్‌, త్రిపుర, గుజరాత్‌, మేఘాలయల్లో భారీ వరదలు సంభవించాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాలలో పంట నాశనమైనది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వ స్పందన అత్యంత నామమాత్రం మాత్రమే. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి తిరస్కరించి పరిమితమైన సహాయం మాత్రమే అందించి చేతులు దులుపుకుంది. ఇదిలావుండగా, పీఎంఎఫ్‌బీవై ఫసల్‌ బీమా పథకం కింద చెప్పుకోతగ్గ మొత్తంలో ఆర్థిక, బీమా సంస్థలకు నిధులు అందినప్పటికీ బాధిత రైతులలో అతి కొద్ది మందికి మాత్రమే అవి చేరాయి. వరద బాధిత కుటుంబాలు, రైతులకు అతి స్వల్ప మొత్తం పరిహారం అందింది. వ్యవసాయ ఉపకరణాలకు సంభవించిన నష్టం, పంట, ఇళ్లు నష్టం, జీవనోపాధి కోల్పోవడంపై నష్టం అంచనా వేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా సాయం అందించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైంది. దుర్బిక్ష ప్రకటన విధానాన్ని ఇప్పటికీ సవరించలేదు. దానితో రైతులు, అవసరతలో ఉన్న ఇతర వర్గాల వారికి ఇంతవరకూ ఎటువంటి ఉపశమనం లభించలేదు.
పెరిగిన సాగు వ్యయం
పెరుగుతున్న సాగు వ్యయం భారతీయ రైతులను మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. ఎరువుల సబ్సిడీలపై గణనీయంగా కోత విధిస్తున్నారు. 202223 కేంద్ర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీలకు రూ. 2,51,339 కోట్లు కేటాయించగా 202324 సంవత్సరం సవరించిన బడ్జెట్‌లో రూ. 1,88,894 కోట్లకు తగ్గిపోయింది. 202425 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ. 62,445 కోట్లను తగ్గించి 1,64,000 కోట్లతో బడ్జెట్‌ను ఖరారు చేశారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)తో నిమిత్తం లేకుండా, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) భావనకు విఘాతం కలిగిస్తూ, రేషన్‌ కార్డుదారులకు పీడీఎస్‌ ద్వారా ఆహార ధాన్యాల సరఫరాను నిలిపివేసి నేరుగా నగదు బదిలీని ప్రారంభించింది. వ్యవసాయ దిగుమతులు కూడా పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత ఉత్పాదనల దిగుమతి 37 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో దిగుమతులు 12.5 బిలియన్‌ డాలర్లు (51 శాతం)పైగా పెరిగాయి. ఈ ఉత్పాదనల దిగుమతిలో భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద దేశంగా అవతరించింది. పత్తి, సోయా ఉత్పాదనలు, తాజా పండ్లు, పాలపొడి తదితరాలను భారత్‌ అధికంగా దిగుమతి చేసుకుంటోంది. దానితో దేశీయంగా సోయాబిన్‌, పత్తి ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కన్నా తక్కువకు పడిపోయాయి. చౌక దిగుమతులను సులభతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం సుముఖత చూపడం దేశీయ రైతులను నాశనం చేసింది, భారతదేశాన్ని ప్రపంచ వ్యవసాయ వస్తువులకు డంపింగ్‌ గ్రౌండ్‌గా మార్చివేసింది. రైతుల పేరుతో కార్పొరేట్‌ దోపిడీ మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంఎఫ్‌బీవై పంట బీమా పథకం ప్రధానంగా ఆర్థిక, బీమా కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తోంది. 2018లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇవి 1,95,207 కోట్ల రూపాయలు అందుకున్నాయి. మహారాష్ట్ర వంటి చోట ‘‘రూపాయి పంట బీమా పథకం’ రైతుల అనుకూలమైనదిగా కనపడినప్పటికీ ప్రభుత్వం అంతిమంగా పూర్తి బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ, అశాస్త్రీయంగా, రైతు వ్యతిరేక ప్రమాణికం కారణంగా కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా మారి వాటికి లాభాలను తెచ్చిపెట్టింది. 95 శాతం సబ్సిడీపై సోలార్‌ విద్యుత్‌ పంపులను ఇచ్చే పునర్‌ ఇంధన మంత్రిత్వ శాఖ పథకం పీఎంకుసుమ్‌ను కూడా ఇదే విధంగా నిర్వహించడం వల్ల అదాని వంటి కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించింది తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రభుత్వ నిధులు కార్పొరేట్‌ సంస్థల అనుబంధ సంస్థల ఖాతాల్లోకి వెళ్లాయి.

అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు

మూడో ప్రపంచ యుద్ధం వైపు బైడెన్‌ యత్నం

0

రష్యా డ్యూమా ప్రతినిధి బూటినా

మాస్కో: అమెరికా తయారీ దీర్ఘశ్రేణి ఆయుధాలు రష్యాపై వాడేందుకు కీవ్‌కు అనుమతిచ్చి బైడెన్‌ ప్రభుత్వం ప్రమాదకర నిర్ణయం తీసుకొందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా విమర్శిం చారు. మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే చర్యగా దీనిని ఆమె అభివర్ణించారు. ‘పదవిలో ఉన్నంత కాలం బైడెన్‌ కార్యవర్గం ఉద్రిక్తతలను గరిష్ఠస్థాయిలో రాజేస్తుంది. ట్రంప్‌ వచ్చాక ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొంటారని ఆశిస్తున్నా. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. అమెరికాలో కొందరు తాము పోగొట్టుకోవడానికి ఏమీ లేదుగా అని భావిస్తుంటారు’ అని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద ఆమె వ్యాఖ్యానించారు. అమెరికాలో రష్యా ఏజెంటుగా పనిచేస్తోందనే ఆరోపణలపై బూటినా దాదాపు 15 నెలలపాటు జైల్లో గడిపారు. ప్రస్తుతం ఆమె యునైటెడ్‌ రష్యా పార్టీ తరపున డ్యూమా సభ్యురాలు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం ఓ నిర్ణయం తీసుకున్నారు. కీవ్‌కు తాము అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేం దుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యాపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్‌కు అవకాశం దక్కుతుంది. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. మరో వైపు ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్ష కార్యాల యమైన క్రెమ్లిన్‌ ఇప్పటి వరకు స్పందించ లేదు. సెప్టెంబర్‌ 12వ తేదీన పుతిన్‌ మాట్లాడుతూ రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగాన్ని పశ్చిమ దేశాలు అంగీ కరిస్తే… నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని తెలిపారు. దీంతో నాటో సైనిక, సాయుధ సంపత్తి లక్ష్యంగా దాడులు చేస్తామన్నారు. తాము నాటో, అమెరికా కోసం విభిన్నమైన ప్రతిస్పందనను సిద్ధం చేసుకొన్నట్లు తెలిపారు.

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండండి

— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగించే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉద్యోగులు, ఉన్నత హోదాలలో ఉన్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారన్నారు. కొరియర్ పేరుతో మోసాలు, చైల్డ్ ఫోర్నో గ్రఫీ, డిజిటల్ అరెస్టు, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హ‌నీ ట్రాప్‌, లాటరీల పేరుతో మోసాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు మోసాలు, లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు ఇస్తామని నమ్మబలకడం, వీడియోకాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్… ఇలా ఎన్నో రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు ఒడిగడతారని అలాంటి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల గురించి యువత కుటుంబంలోని వారికి, ఇతరులకు అవగాహాన కల్పించాలన్నారు. బ్యాంకు ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌ వర్డ్ లను సెట్ చేసుకోని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నెంబర్ కి డయల్ చేసి సమాచారం అందించడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో డబ్ల్యూ డబ్ల్యూ .సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ ఫిర్యాదు చేయాలన్నారు.

అనంతపురం జిల్లాను ఓడిఎఫ్ రహిత జిల్లాగా రూపొందించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లాను ఓడిఎఫ్ రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం అనంతపురం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ మరియు పంచాయతి శాఖల ఆధ్వర్యంలో… ఁప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంఁ కార్యక్రమం సందర్భంగా జిల్లా నీరు మరియు పారిశుద్ధ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యం మరియు పరిశుభ్రత అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగా నేటి (19) నుండి డిసెంబర్ 10 వరకు..ఁమన మరుగుదొడ్డి- మన గౌరవం నినాదంతో… ఁమరుగుదొడ్డి వాడుదాం ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాంఁ అని జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.  జిల్లా, డివిజన్, మండల, గ్రామ, పంచాయతీ వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల మరమ్మత్తుల కార్యాచరణను నిర్వహించడం, వ్యక్తిగత మరియు కమ్యూనిటీ మరుగుదొడ్లను సుందరీకరించడం అలాగే పారిశుద్ధ్య వీరులను గుర్తించి సన్మానించడం తదితర కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిధులు విడుదల చేయడంతోపాటు ప్రజలందరూ మరుగుదొడ్లను ఉపయోగించుకునేలా అందరినీ భాగస్వాములు చేయడమైనది.    మరుగుదొడ్ల వాడకంలో నీటి లభ్యత ముఖ్యం. ప్రతి మరుగుదొడ్డికి నీటి సరఫరా ఉండేలా అధికారులు కృషి చేయాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలి. జిల్లాలో ఇంకను వ్యక్తిగత లేదా సామూహిక మరుగుదొడ్లు వాడని వర్గాలు మరియు ప్రాంతాలపై దృష్టి పెట్టి.. మరుగుదొడ్ల ప్రాముఖ్యతపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు ఉపయోగించేలా కృషి చేయాలన్నారు.మన మరుగుదొడ్డి- మన గౌరవం(హమారా శౌచాలయ్ – హమారా సన్మాన్) కార్యక్రమం ద్వారా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలని, విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన కల్పిస్తే తద్వారా వారి తల్లిదండ్రులు కూడా మరుగుదొడ్ల వాడకం పై అవగాహన పెంచుకుంటారని, అలాగే ఐసిడిఎస్, వైద్యశాఖ, డిఆర్డిఏ, డ్వామా, డిఇఓ  అధికారులు వారి పరిధిలో మరుగుదొడ్ల వాడకంపై విస్తృత అవగాహన కల్పించాలని, అలాగే అధికారులకు గ్రామ, మండల, జిల్లా స్థాయి  కార్యాలయాలలోని   మరుగుదొడ్ల రిపేరు చేసుకొని, నీటి సరఫరా ఉండేటట్లు చూసి,  శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,  మరుగుదొడ్లకు సంబంధించి మండల పరిధిలోని గుర్తించిన ప్రదేశాల నివేదికలు  తయారు చేసుకోవాలని, జల్ జీవన్ మిషన్ కు సంబంధించి  బడ్జెట్  కేటాయించడం వెంటనే పనులను ప్రారంభించాలని, అంగన్వాడి కేంద్రాలలో  అనుమతి పొందిన   పనులను త్వరితగతిన   పూర్తి చేయాలని   జిల్లాకలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్,
డీపీఓ నాగరాజు,డియంహెచ్ఓ ఈ బి దేవి, ఐసిడిఎస్ పిడి  శ్రీదేవి, డీఈవో ప్రసాద్ బాబు, డిఐపిఆర్ఓ గురు స్వామి శెట్టి, డిఆర్డిఏ,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ధర్మవరం బాల బాలికలు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర స్థాయిలో ఈ నెల నవంబర్ రెండవ తేదీ నుండి నాలుగో తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( ఎస్ జి ఎఫ్)రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో లో పాల్గొనే అండర్ 14 విభాగంలో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో.. బి. యశస్విత,అలాగే బాలుర విభాగంలో బి. శశిధర్ కుమార్… బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు . రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి, ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.

ఆ ఐదు గ్రామాలకు సాగునీరివ్వండి

అనంతపురం జిల్లా కలెక్టర్ కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు రావడం లేదు

ఐదు గ్రామాల్లో తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడి ఉందన్న శ్రీరామ్

సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు విడుదల చేయకపోవడం వలన ఐదు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్రమైన తాగు, సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా ఇదే అంశం పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి వినతి పత్రాన్ని అందజేశారు. పరిటాల శ్రీరామ్ తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామస్థులతో కలసి కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ ని కలిసి నీటి సమస్య గురించి వివరించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ హెచ్చెల్సీ కాలువకు అనుబంధంగా ఉన్న పులివెందుల బ్రాంచి కెనాల్ కు గత కొన్ని సంవత్సరాలుగా నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీఆర్ డ్యాం సౌత్ కెనాల్ మీదుగా ఉన్న తుంపెర డీప్‌కట్ సమీపంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఆఫ్‌టేక్ పాయింట్ ఉందన్నారు. డీప్‌కట్‌లో 6కి.మీ నడిచిన తర్వాత కాలువ నదిలో కలుస్తుందన్నారు. చివరకు పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు వలన ప్రయోజనం ఉంటుందని పీబీసీకి నీరు అందినప్పుడల్లా డీప్‌కట్‌ ప్రాంత రైతులు బోరుబావుల సాయంతో ఆయకట్టును సాగు చేస్థున్నారన్నారు. కానీ గండికోట – చిత్రావతి లిఫ్ట్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత 2018 నుండి హెచ్‌ఎల్‌సి సిస్టమ్ నుండి పిబిసికి నీటిని పూర్తి సామర్థ్యంతో విడుదల చేయడం లేదన్నారు. ఐడిసి స్కీమ్‌లకు మాత్రమే మైనర్ డిశ్చార్జెస్‌తో నీటిని విడుదల చేస్తున్నారని.. దీని వలన రైతులకు సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిమర్రి మండలం రామాపురం, కునుకుంట్ల, చిలకొండయ్య పల్లి, నార్పల మండలం గుగూడు ముచ్చుకుంటపల్లి గ్రామస్తులు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల అవసరానికి తీర్చడానికి ఎర్ట్స్ వైల్ పిబిసి కెనాల్ నుండి తగినంత ఎక్కువ నీటిని కేటాయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులపై ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారం తీసుకొని ఉన్నత స్థాయిలో చర్చించిన తర్వాత ఐదు గ్రామాలకు నీరు అందేలా కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి..

ట్రాఫిక్- ఎస్ఐ. వెంకటరాముడు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాలు జరగవు అని ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరాముడు తెలిపారు. ఈ సందర్భంగా పలు ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమైన కూడలిలలో ద్విచక్ర, కార్లు ఇతరత్రా వాహనాలు నిలపరాదని, అలా నిలిపితే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై తీసుకోవలసిన జాగ్రత్తలను పట్టణంలోని ఆటో డ్రైవర్లకు వ్యాన్ డ్రైవర్లకు తగిన సూచనలు ఇస్తూ అవగాహనలు కూడా కల్పించడం జరుగుతోందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే ఎవ్వరూ కూడా వాహనాలు నడపరాదని తెలిపారు. మైనారిటీ కు చెందిన వారికి వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా కట్టడి చేయాలని తెలిపారు. పట్టణములో ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానాలు తప్పవని వారు హెచ్చరించారు. పట్టణంలో వాహనాలు వేగంగా వెళ్లరాదని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలకు కళాశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. ఎందుకనగా నియమ నిబంధనలు తెలియకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినప్పుడే సుఖవంతమైన ప్రయాణంతో పాటు ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఉన్న సిబ్బందితో ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా దుకాణాల వద్ద గంటలు తరబడి వాహనాలు ఉంచరాదని, దీనివల్ల ట్రాఫిక్కుకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున దుకాణాదారులు తమ షాపు వద్ద పార్కింగ్ ఉండకూడదని వారు తెలిపారు. అతివేగం అమిత ప్రమాదమని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందని తెలిపారు. కావున ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి, ప్రమాదాలు లేకుండా పట్టణ రహితగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

రుణాల మంజురు లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాల మంజురు లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఇందుకు జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ లో ఉన్న డి.పి.ఆర్.సి భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించాలని, ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. కొద్ది రోజుల కింద నగరంలోని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో ప్రధానమంత్రి సూర్యఘర్ మేళా నిర్వహించడం జరిగిందని, అలాగే కలెక్టరేట్లో పిఎమ్ఈజీపి, స్టాండప్ ఇండియా, తదితర పథకాల కింద రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు లబ్ధిదారులకు రుణాలు అందించడం జరిగిందని, ఇందులో బాగా పనిచేసిన బ్యాంకర్లను, ఎల్డీఎంని అభినందించారు. మెప్మా కింద ఎస్.హెచ్.జి బ్యాంకు లింకేజ్ కి సంబంధించి జిల్లాకు 2,010 ఎస్.హెచ్.జిలకు బ్యాంకు లింకేజ్ చేయాలని లక్ష్యం విధించగా, అందులో గత సెప్టెంబర్ వరకు 1,005 ఎస్.హెచ్.జిలకు బ్యాంకు లింకేజ్ చేయాల్సి ఉండగా, 1,441 బ్యాంకు లింకేజ్ చేయడం జరిగిందని, 143.38 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది కేటాయించిన లక్ష్యానికి మించి మరింత ముందుకు వెళ్లి బ్యాంకు లింకేజీలు చేపట్టాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద గతేడాది 30 శాతం, ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మాత్రమే రుణాలు ఇవ్వడం జరిగిందని, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులకు ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయా పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు నిత్యం సమీక్ష నిర్వహించాలని ఎల్డీఎం, జిల్లా అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ పథకాలు మొదలయ్యే అవకాశం ఉందని, జిల్లా అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం బాగా ఉంటే పథకాల గ్రౌండింగ్ మరింత పెరుగుతుందన్నారు. ఎల్డీఎం, డిఆర్డిఏ పిడి, మెప్మా పీడీలు బ్యాంకర్లతో 7 రోజుల్లోగా సమావేశాలు నిర్వహించి కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఏడు మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్ చేయడం జరిగిందని, ఆయా మండలాల్లో ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడం చేయాలని, కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. రుణం తిరిగి చెల్లించడం చేయకపోయినా కొత్త రుణాలు ఇవ్వవచ్చన్నారు. హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకునేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు 35 వేల రూపాయల చొప్పున రుణాలు అందజేయాలని డిఆర్డిఏ పిడికి సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు 90 శాతం పూర్తయి ఉన్న రెండు గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయాలని, జిల్లాలో 577 గ్రామ పంచాయతీలు ఉండగా, ఆయా పంచాయతీలలో అన్ని ప్రభుత్వ పథకాల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రామ పంచాయతీలు చొప్పున జిల్లాలో 100 వరకు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుని ముందుగా ప్రభుత్వ పథకాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను సమన్వయంతో పనిచేయడం ద్వారా వాటిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొని, పథకాల అమలులో పురోగతి తీసుకువచ్చేలా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎల్.డి.ఎం నర్సింగ్ రావు, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, నాబార్డు ఏజిఎం అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ జెడ్ఎం శ్రీధర్, ఫిషరీష్ డిడి శ్రీనివాసనాయక్, డీపీఓ నాగరాజునాయుడు, ఎస్సి కార్పొరేషన్ ఈడీ సారయ్య, మెప్మా పిడి విశ్వజ్యోతి, వివిధ బ్యాంక్ సీఈఓలు, మేనేజర్లు, బ్యాంకర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కోర్టు తీర్పును ధిక్కరిస్తూ రైతులకు నోటీసులు జారీ చేసిన వీఆర్వో పై చర్యలు తీసుకోవాలి

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కోర్టు తీర్పును ధిక్కరిస్తూ రైతులకు నోటీసులు జారీ చేసిన వీఆర్వో సురేష్ పై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం పెద్దకడబూరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం నాయకులు మబ్బు ఆంజనేయ, సిపిఐ పార్టీ సభ్యులు రాజు, ఏఐవైఎఫ్ మంత్రాలయం అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో సర్వేనెంబర్ 177/1 174/3 174/1 177/3a 177/3ప గల భూమిలో గతంలో పేద రైతులు అనుభవంలో ఉన్నారన్నారు. పెత్తందారులైన ఓకే వీరేష్, లక్ష్మన్న లు రైతులను భయాందోళన గురి చేసి రైతులను బెదిరించడం జరిగిందన్నారు. ఈ విషయంపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉద్యమాలు , పోరాటాలు తర్వాత ఈ భూమి RశీR కేసు కూడా అయినట్లు తెలిపారు.వారి కుటుంబ సభ్యుల పేర్లు మీద ఉన్న డాక్యుమెంట్లు డూప్లికేట్ డాక్యుమెంట్లు అని ఆనాడే సబ్ కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వాళ్ల పేర్లు కూడా తొలగించాలని ఆదేశించారని తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా వీఆర్వో బీటీ సురేష్ కోర్టు కేసు ఉన్నా కూడా పెత్తందారులతో కాసులకు కక్కుర్తి పడి పేద రైతులకు నోటీసులు ఇచ్చి పెత్తందారులకు అడుగులకు మడుగులొత్తుతున్న వీఆర్వో సురేష్ ని వెంటనే సస్పెండ్ చేయాలని కోర్ట్ కేసులు ఉన్నా కూడా చట్టామంటే ఆయనకు లెక్క లేదు కాసులొస్తే చాలు అనుకున్న విఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ శ్రీనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, నాగిరెడ్డి, రమేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.