Friday, December 27, 2024
Home Blog Page 63

గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి.. డాక్టర్ ప్రియాంక, చిన్నప్ప


విశాలాంధ్ర ధర్మవరం : గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ ప్రియాంక, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీని వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక అధ్యక్షులు చిన్నప్ప కార్యదర్శి మంజునాథ్ మాట్లాడుతూ ప్రతి మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు నెలవారీగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు, టీకాలు పొందాలన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా గర్భిణీ స్త్రీలకు అన్ని సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళం అందించిన వరప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, గట్టు వెంకటేష్, జింక చిన్నప్ప, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి అక్రమార్కులపై చర్యలు తథ్యం..పవన్ కల్యాణ్

ఉపాధి హామీ పథకం పనులను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని, ఆ నిధులను పెద్ద మొత్తంలో దారి మళ్లించారని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. జాబ్ కార్డుల జారీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్య ధోరణిపై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప‌లు ప్రశ్నలకు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌ సమాధానం ఇచ్చారు. ఉపాధి పథకం అనేది డిమాండ్ ఆధారిత పథకమన్నారు. నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి కూలీనాలీ జనానికి 100 రోజలు పని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు ఇస్తున్నామని, 100 రోజులు పని కల్పించని స్థితిలో 15 రోజులు వేతనం పరిహారం చెల్లిస్తున్నామన్నారు. జాబ్ కార్డుల జారీలో జరిగిన అవకతవకలపై తప్పని సరిగా చర్యలు తీసుకుంటామన్నారు.

అక్రమార్కుల‌పై చర్యలు తప్పవు..

అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 4500 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం ₹13వేల కోట్లు దారి మళ్లించిందని.. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేస్తామన్నారు. కాలువల్లో తూడు తొలగింపు పనులను డిస్ట్రిబూటర్ కమిటీలు చేపడుతాయని, కానీ తూడు తొలగింపు పనులు అత్యవసరమైతే స్థానిక ఎమ్మెల్యే కోరితే ఆ పనులు చేపట్టవచ్చన్నారు. ఇక శ్మాశాన వాటికల్లో పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేస్తామన్నారు. పాఠశాలల కాంపౌండ్ వాల్ నిర్మాణాల తర్వాత శ్మశాన వాటికలకూ ప్రహరీ గోడలు నిర్మించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని, తాగునీరు, వైద్యం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామన్నారు.

పేదలకు చీరలు,దుప్పట్లు పంపిణీ

డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : భగవాన్ శ్రీ సత్య సాయి 99 జయంతిని పురస్కరించుకొని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్,డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి ఈ రోజు నిరుపేదలైన 300 మందికి చీరలు,దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్య సాయి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిరుపేదలైన రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు,లాప్రోస్కోపి చికిత్సలు చేసి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఏడది వలె ఈ ఏడాది కూడా సత్యసాయి 99వ జయంతిని పురస్కరించుకొని 99 రోజులపాటు 99 మంది నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన జయంతి రోజున నిరుపేదలకు చీరలు,దుప్పట్లు, బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామమూర్తి సతీమణి అక్కేన లక్ష్మి, ఆయన కోడలు డాక్టర్ మాధురి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

గౌతమ్ అదానికి బినామీ నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన లంచం తీసుకున్న నేరస్తులే….

సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర అనంతపురం : గౌతమ్ అదానికి బినామీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడని, అవినీతికి పాల్పడిన లంచం తీసుకున్న వాళ్లు నేరస్తులే అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. జాఫర్ పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ కోసం ముడుపులు చెల్లించిన గౌతమ్ ఆదానిని అరెస్ట్ చేయాలని శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఆదాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సి. జాఫర్, సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఏ ఐ టి యు సి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. రాజారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా మొట్టమొదటిసారిగా అదాని అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేపడుతూ గౌతమ్ ఆదాన్ని దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకుంటుండగానే ఆదాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ…. సౌర విద్యుత్ ప్రాజెక్టు పేరుతో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్లు ,అమెరికాలోని బ్యాంకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి 1,500 కోట్లు పెట్టుబడి సేకరించిందన్నారు. అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలో ఆ దేశంలోని ఫారిన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచమిచ్చినా నేరం అవుతుందన్నారు. భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతంతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గడ్,ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య మంత్రులకు లంచాలు ఇచ్చినట్టు అమెరికా న్యూయార్క్ కోర్టులో కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందన్నారు . గౌతమ్ అదాని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 2021 ఆగస్టు, ఏడో తేదీన కలిసి 1,750 కోట్లు ముడుపులు ముట్టినట్లు నిర్ధారణ అయిందన్నారు. 2016లో ఆదాని సంస్థ 20 మెగావాట్లు ఉండగా, 2018లో 2000 మాగావాట్లు, 2025 నాటికి 25 వేల మెగావాట్లు విస్తరింప చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగిందన్నారు. ఆర్థికపరమైన అరాచకాల్లో షేర్లను పెంచడం జరిగిందన్నారు. ఈ అవినీతిపై అమెరికా న్యూయార్క్ కోర్టు కేసు పెట్టడం జరిగిందన్నారు. అతనితోపాటు తమ్ముని కుమారుని పైన మొత్తం ఎనిమిది మంది పైన కేసు నమోదు చేశారన్నారు. రెండు లక్షల ,24 వేల కోట్ల రూపాయలు షేర్లు విలువ పడిపోయిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పరువు ప్రతిష్టను మంటగలిపిన అధానీని అరెస్ట్ చేయాలన్నారు. ఈ విషయంపై నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. ప్రభుత్వాలు నేర సామ్రాజ్యాన్ని అరికట్టే ప్రయత్నం చేయడం లేదన్నారు. అందులో భాగంగా దాని దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. గౌతమ్ ఆదాయాన్ని అరెస్ట్ చేయాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శిలు రమణయ్య, అలిపిర, పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

డిసెంబర్ 1న సాహితీవేత్తలకు పోటీలు

జిల్లా రచయిత సంఘం సభ్యులు జయసింహ, సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు పోలా ఫంక్షన్ హాలు నందు శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ బాషా ఆదేశాను ప్రకారం ఈనెల 1వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా రచయితల సంఘము, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యువర్ ఫౌండేషన్, ధర్మాంబా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం, సోమల రాజు ఫౌండేషన్-బెంగళూరు, మెహర్ బాబా సెంటర్, వృద్ధుల వైద్యాశ్రమం-ధర్మవరం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా రచయిత సంఘం సభ్యులు జయసింహ, సత్య నిర్ధారన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ మూడవ తేదీ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని సాహితీవేత్తల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మనో బంధు, గౌతమ బుద్ధ హరిత వికాస వృద్ధుల విడదీ, పర్యాటక కేంద్రం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్యము, చేనేత అంశములపై కవితతో పాటు గేయం వ్యాస ప్రక్రియలలో పోటీలు ఉంటాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల నుండి ఆసక్తి గల సాహితీవేత్తలు పాల్గొనవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ (వాట్సాప్ నెంబర్) 9494018465 కు సంప్రదించాలని తెలిపారు.

ఆర్టీసీ ధర్మవరం డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా తిరుమలేష్ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షునిగా తిరుమలేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ ఎంపిక ఆర్టీసీ డిపో ఆవరణంలో రీజినల్ ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీరాములు సమక్షంలో నిర్వహించారు. తదుపరి ఏకగ్రీవంగా ఎంపికైన అధ్యక్షుడు తిరుమలేష్ కు రీజినల్ ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా, డిపో చైర్మన్ సుమో సీన, సిడిసి మల్లికార్జున,గ్యారేజ్ సహకార దర్శి భాస్కర్ తో పాటు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించండి

ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన సునీత, శ్రీరామ్

ఇరిగేషన్, విద్యుత్, దేవాదాయశాఖల వారిగా విజ్ఞప్తులు
విశాలాంధ్ర ధర్మవరం : రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో పాటు జలవనరులు, దేవాదాయ, విద్యుత్, పర్యాటక, గనుల శాఖల మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి జాకీ పరిశ్రమ ఏర్పాటు, నడిమివంక రక్షణ గోడనిర్మాణం, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేసిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని నడిమివంక రక్షణ గోడ నిర్మాణానికి, నియోజకవర్గంలో ప్రాజెక్ట్ ల పనుల గురించి వివరించారు. పేరూరు ప్రాజెక్టు కు నీరందించే పనులు అలాగే గేట్ల మరమ్మతులు వంటి వాటిపై విజ్ఞప్తి చేశారు. పీఏబిఆర్ కుడి కాలువ ద్వారా 53 చెరువులకు నీరందించాలన్నారు. అలాగే హెచ్చెల్సీ ద్వారా పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు విడుదల చేయాలని,ఈ కాల్వ నుంచి తాడిమర్రి మండలంలోని చివరి చెరువు వరకు నీరు అందేలా చూడాలన్నారు. ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ ప్రాజెక్టు పనులు నిలిపివేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చి రైతులకు ఉపయోగకరంగా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. మరోవైపు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలసి ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలలో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు కూడా మంజూరు చేయాలని వారు తెలిపారు. స్పందించిన విద్యుత్ శాఖ మంత్రి సీఎండీకి ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని కలిసి పలు గ్రామాలు తోపాటు ఎస్సీ ఎస్టీ కాలనీలలో దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని తిరుమలేశ్వర ఆలయంలో దుర్గాదేవి ఆలయానికి మెట్ల ఏర్పాటు 50 లక్షలతో స్నేక్ బార్ మరుగుదొడ్లను నిర్మించాలని వారు కోరారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కూడా వారు కలిసి ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యాటకరంగా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తిరుమల దేవర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పర్యాటక సౌకర్యాల అభివృద్ధి ఎన్ హెచ్ 44 అనంతపురం సమీపంలోని మరో టోల్గేట్ వద్ద 25 లక్షలతో స్నేక్ బార్ నిర్మాణము ఆత్మకూరు జాతీయ రహదారి సమీపంలో టూరిజం వే సైడ్ సౌకర్యాలు నసనకోట ముత్యాలమ్మ గుడి దగ్గర పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా టూరిజం రెస్టారెంట్ మరుగుదొడ్లు నిర్మించాలని తెలపడం జరిగిందని తెలిపారు. చెన్నై కొత్తపల్లి మండలం కోన శివాలయం వద్ద పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా టూరిజం రెస్టారెంట్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలని తెలపడం జరిగిందన్నారు. పేరు డ్యాం వద్ద బోటింగ్ అభివృద్ధి చేయాలని,తదుపరి భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి రామగిరి బంగారుగనులను మళ్లీ తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగిందని తెలిపారు. దీనివలన వందలాదిమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సమస్యలన్నింటిపై సంబంధిత మంత్రులు సానుకూలంగా స్పందించడం జరిగిందని పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని పనులు చేపడతామని మంత్రులు హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.

పుట్టపర్తి లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు గైకొనండి

ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్
విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు గైకొనాలని ఏపీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వైశాన్సులర్ కృష్ణయ్యకు వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న ప్రేమ్ సాయి అనే విద్యార్థి పై తోటి విద్యార్థులు దాడి చేయడం వల్ల ఆ విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు. మృతి చెందిన విషయం తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. కనీసం కళాశాలలో ఏమి జరుగుతోంది అన్న విషయాన్ని కూడా కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందడం జరిగిందని వారు ఆరోపించారు. కావున ఆ కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కళాశాలలో పోలీస్ టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్, ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై పర్యవేక్షణ జరపాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు తెలిపారు. సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మా పోరాటాలు ఆపమని తెలిపారు.

పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ధర్మవరం వారి సేవలు

విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో బాబా 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలోని గాంధీ నగర్ వారి శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ప్రశాంతి రైల్వే స్టేషన్ పుట్టపర్తి వెళ్లే వెయ్యి మంది భక్తాదులకు మధ్యాహ్నం భోజన ఏర్పాటును నిర్వహించడం జరిగిందని కన్వీనర్ నామప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 21 న, 22న, 23న (మూడు రోజులపాటు) భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది సేవా కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తాదులు శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

వృత్తి విద్య‌లో నైపుణ్యం సాధించాలి

0

విద్యుత్ ఏఈ ఆంజినేయ శాస్త్రి
వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : విద్యార్థులు చదువుతోపాటు వృత్తి విద్య‌లో నైపుణ్య‌త సాధించాల‌ని విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ ఆంజినేయ శాస్త్రి, ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారిలు అన్నారు. ఒకేషనల్ ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 33/11 కే.వి ఉప విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ ఎలా సరఫరా అవుతుందో, విద్యుత్తును ఎలా వినియోగించుకోవాలనే అంశాలతో పాటు విద్యుత్ సరఫరా అయ్యే వివిధ రకాల ట్రాన్స్ ఫార్మర్ల పరికరాల పనితీరు గురించి విద్యుత్ ఏఈ ఆంజినేయ శాస్త్రిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఈ ఆంజినేయ శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన ఇతర రంగాల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రస్తుత ఆధునిక యుగంలో విద్యార్థులు సాంకేతికంగా మరియు వృత్తి విద్య లోనూ నైపుణ్యం ప్రదర్శించాలని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వృత్తి విద్య కోర్సుల ద్వారా త్వరగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్య ఉపాధ్యాయుడు శివకుమార్, రాజు మరియు ఉపాధ్యాయులు ఆనంద్, బాబు, విద్యు సబ్ స్టేషన్ ఆపరేటర్ మల్లికార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.