జిల్లాలు మారితే దిక్కులు మారతాయా
వంద సంవత్సరాల పేరు ని మార్చేస్తే ఎలా?
గోదావరి వాసుల మనోవేదన కు అర్థం ఏమిటి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఎక్కడో పుట్టి.. ఉరకలు పెట్టి.. సముద్రం లో కలిసే వరకు గోదావరి నదికి అసలు పేరు మారలేదు. కానీ గోదావరి తీరం లో ఉన్న ప్రాంతాలకు మాత్రం గోధావరి అనే పదంతో అనేక పేర్లు పుడుతున్నాయి, మారు తున్నాయి. వాటితో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న పేర్ల కారణంగా నది తీరాన్ని చేరి ఉన్న దిక్కులు మాత్రం మారి పోతున్నాయి. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టిన గోదావరి మన రాష్ట్రంలో ప్రవహిస్తూ చివరకు అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. నదీ ప్రవాహానికి ఇరువైపులా వివిధ పేర్లతో గ్రామాలు ఏర్పడి ప్రజలు నివసిస్తున్నారు. అందులో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పేర్లు ఓకటి. ఇవి చాన్నాళ్లనుంచి ప్రాచుర్యం లో ఉన్నాయి. అలాగే భౌగోళికంగాను, దిక్కులను బట్టి గోధావరి నదికి ఆవలి వైపున ఉన్న ప్రాంతం తూర్పు, ఈవలి వైపున ఉన్న గ్రామాలను పశ్చిమ ప్రాంతం గా పేర్కొంటూ 100 సంవత్సరాల నాడు తూర్పు వైపు ఉన్న గ్రామాలను కలిపి తూర్పు గోదావరి జిల్లా గా, పశ్చిమ వైపు గ్రామాలను కలిపి పశ్చిమ గోదావరి జిల్లాలు గా అప్పట్లో నామకరణం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధి లోకి వచ్చే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు దాదాపు 100 సంవత్సరాల తరువాత అనేక పేర్లు తో ప్రాచుర్యం లోకి వస్తున్నాయి. ఈ రెండు జిల్లాల ను విభజన ప్రక్రియ లో ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేయటం ఆశాస్త్రీయంగా జరిగిందని, విభజన చేపట్టె నేపధ్యం లో కొత్త జిల్లా ఏర్పాటు పై ఆయా ప్రాంత ప్రజల మనోభావా లను కూడా పరిగణలోకి తీసుకోలేదనే వేదన తూర్పు గోదావరిగా మారిన పాత పశ్చిమ వాసుల మదిలో నేటికీ తొలుస్తున్న విషయంగా మిగిలి పోయింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా మార్చడం వల్ల పాత తూర్పుగోదావరి జిల్లాలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాలను 3 జిల్లాలు గా నామకరణం చేస్తూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాగా , అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని మొదట కోనసీమ గా ప్రకటించినా .. అక్కడి ప్రజల మనోభావాలను బట్టి డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కోనసీమ గా పెట్టారు. ఇక మిగిలిన మూడవ జిల్లాకు తూర్పు గోదావరి జిల్లాగా నామకరణం చేశారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా 4 నియోజకవర్గాలు తూర్పుగోదావరి లోనూ, 3 నియోజకవర్గాలు పశ్చిమగోదావరి లోనూ ఉన్నాయి. దీనికి రాజమండ్రి జిల్లా లేదా గోదావరి జిల్లా అని పేరు పెట్టకుండా తూర్పుగోదావరి జిల్లా గా ఉంచేశారు . తూర్పుగోదావరి జిల్లా వాసుల అభిప్రాయం తెలుసుకున్నారేమో గానీ పశ్చిమగోదావరి వాసుల మనోభావాలు తెలుసుకోలేదు. ఈ విధంగా రెండు ప్రాంతాల్లోని 7 నియోజకవర్గాలను కలిపి రాజమండ్రి కేంద్రం గా తూర్పుగోదావరి జిల్లాగా 2022 లో ప్రకటించారు. అప్పటి నుంచి కూడా పాత పశ్చిమ వాసులకు ఒకటే మనో వేదన. శాస్త్రీయంగా, భౌగోళికంగా గోదావరి జిల్లాలు రెండింటికి కూడా ఒక అర్ధం ఉండేది. గోధావరి నదికి ఆవలవున్న ప్రాంతం అంటే నదికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లా గాను, ఇవతల అంటే గోధావరి నదికి పడమర ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగాను పిలవడం ప్రాచుర్యం లో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన నాటి నుండి వంద ఏళ్లుగా గోధావరి జిల్లాకు తూర్పు, పశ్చిమ పేర్లు ప్రాచుర్యం లో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత 2022 లో జరిగిన విభజన పార్లమెంటరీ స్థానాన్ని ఒక జిల్లాగా చెయ్యటం తో జిల్లాకున్న ప్రాముఖ్యత ను సైతం వదిలిపెట్టి విభజన జరిగి జిల్లా పేర్లు మారటం కొన్ని ప్రాంతల ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. నియోజకవర్గాల పరిధి, జనాభా ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటై వుండవచ్చు. భౌగోళికంగా ఉన్న స్థితి ని బట్టి కానీ దిక్కుల బట్టి కానీ చుస్తే పశ్చిమాన ఉన్న ప్రజలకు తూర్పు గోదావరి వాసులుగా పిలవబడటం పట్ల అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. దీనితో ప్రాంతీయతను, దిక్కులను మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. పశ్చిమ గోదావరిజిల్లా లోని కొన్ని ప్రాంతాలు ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక ఐకాన్ గా వుండే ద్వారాకాతిరుమల తూర్పు గోదావరి జిల్లా పరిధి లోకి కలిసి జిల్లా మార్పు పై అప్పట్లో విపరీతమైన విమర్శలు చర్చలు జరిగాయి. ఇక చరిత్రలోకి వెళితే రాజులు పరిపాలన ముగిసిన అనతి కాలం లో గోధావరి జిల్లా గాను తరువాతి కాలంలో 1925 సమయం లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు గాను పేర్లు ఏర్పడ్డాయి. ఆ పేర్లకు జిల్లాలకు దిక్కులు, భౌగోళిక పరిస్థితి వెరసి ఓ ప్రాముఖ్యత కూడా ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా కొన్నాళ్ళు పాచిమా గోదావరి జిల్లా గా ఉండేది అన్నది చరిత్ర చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. గణాంకాలను అనుసరించి పశ్చిమ గోధావరి సరిహద్దులో కృష్ణా జిల్లా, తూర్పున తూర్పు గోదావరి జిల్లా, దక్షిణాన బెంగాల్ బే, ఉత్తరాన ఒక ప్రాంతం అనే ప్రామాణికాలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు భాష ఏస అలవాట్లు వీటిపై అనేక కధనాలు మనకు వినిపిస్తుంటాయి. ఇక 2022 లో ఒకసారి జరిగిన జిల్లాల పునర్ విభజన అనంతరం తాజాగా మరి కొన్ని మార్పులు చేస్తున్న నేపధ్యం లో పశ్చిమ వాసుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవలన్న డిమాండ్ వినబడుతోంది. ఈ సారైనా తూర్పుగా మారిపోయిన పశ్చిమ ప్రాంతం తో కలిపి జిల్లా కు కొత్త నామకరణాలు చేయాలని, గోధావరి నదికి పశ్చిమలో ఉన్న కొవ్వూరు నిడదవోలు నియోజక వర్గ ప్రాంత దిక్కులు మారకుండా జిల్లాల పరిధి మార్చటం తప్పని పరిస్థితి అయితే గోధావరి జిల్లాల మనో భావాలను దెబ్బ తీయకుండా ఆలోచన చేయాల్సి ఉంది. ఉదాహరణ కు కొవ్వూరు పేరు గతం లో గోవూరు అని ఉండేదని కాలక్రమం లో పేరు కొవ్వూరు గా మారింది కానీ గ్రామం ఇంకో గ్రామం లో కలవలేదు. దిక్కులు మారలేదు. అలాగే తప్పని సరి పరిస్థితుల్లో జిల్లా విభజన చేయాల్సి వస్తే ఈ రెండు జిల్లాల వాసులకు నచ్చే విధంగా గోదావరి జిల్లా గా కానీ, రెండు ప్రాంతలకు మధ్య గోధావరి ప్రవహిస్తు ఉన్నంధున సెంట్రల్ గోదావరి జిల్లా గా కానీ ,జిల్లా కేంద్రం గా ఉన్న రాజమహేంద్రవరం జిల్లాగా కానీ, సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి జిల్లా అని కానీ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాల ప్రజల పశ్చిమ సెంటిమెంటు పోకుండా పశ్చిమ గోదావరి జిల్లా లోనే విలీనం చేయాలని కోరుతున్నారు. మనిషికి ఇంటి పేర్లు మాదిరిగానే జిల్లా పేరును కూడా మార్చకుండా ఉండేలా కొత్త ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పేరు మార్పు విషయం లో అధికారులు, మేధావుల అభిప్రాయాల తో పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసు కోవాలని కోరుతున్నారు.


