Homeఆంధ్రప్రదేశ్రోడ్డు కోసం మద్దూరు గ్రామస్తుల ఆవేదన

రోడ్డు కోసం మద్దూరు గ్రామస్తుల ఆవేదన

- Advertisement -

రోడ్డు కోసం రోడ్డెక్కనున్న గ్రామస్తులు

ప్రభుత్వాలు మారుతున్నా మా రోడ్డు రాత మారట్లేదు

చినుకు పడితే.. చిత్తడే

ఓట్లకు సై… రోడ్ కు నై.. నై

రాష్ట్రమంతా స్త్రీ శక్తి, పల్లె వెలుగు మాకు బస్సు వెలిగే లేదు

ప్రసవ నొప్పులు వస్తే ఆందోళనే

విశాలాంధ్ర బ్యూరో- తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కు కూతవేటు దూరంలో గోదావరి గట్టు ఆనుకుని ఉన్న మద్దూరు గ్రామానికి రోడ్డు కావాలని కోరుతూ ఆ గ్రామస్తులు రోడ్డు బాట పట్టనున్నారు. కొవ్వూరు మండలం లో ఉన్న మద్దూరు గ్రామం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు సమీపంలో గోదావరి గట్టుని ఆనుకొని ఉంది. పేరుకు గోదావరి గట్టుని అనుకుని ఉన్న గ్రామం అయినా నివాసాలు మాత్రం గట్టు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ఈ మూడు కిలోమీటర్ల రోడ్డు అస్తవ్యస్తముగా గుంతలతో చినుకు పడితే చిత్తడే అన్నట్లుగా వర్షం వస్తే చెరువుని తలపించే విధంగా ఉంటుంది. ఎక్కడ గోయ్యో.. ఎక్కడ గట్టో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ గ్రామస్తులు చెప్పేదేంటంటే ఈ రోడ్డు వేసి 20 సంవత్సరాలు పైగానే అవుతుందని, తరువాత ఎన్ని ప్రభుత్వాలు మారినా దీనికి గుంతలు పూడ్చడం గానీ రోడ్డు వేయడం గానీ జరగ లేదన్నారు. సుమారు 7000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 3400 ఓట్లు కూడా ఉన్నాయి. మేము ఓట్లు వేస్తున్నాం పన్నులు కడుతున్నాం కానీ రోడ్డు వేయడానికి నిధులు లేవని చెప్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏదో మాటలతో సరిపెడుతున్నారే కానీ రోడ్డు మాత్రం మాకు అందని ద్రాక్ష పండులా గోదారంత దూరంలో ఉంది. వరదలు వస్తే ఒకప్పుడు గోదావరి సైతం పొంగి ఊళ్లోకి వచ్చింది కానీ గోదావరి గట్టునుండి మా ఊర్లోకి రోడ్డు పోత రావటం లేదు అని మద్దూరు ప్రజలు చెబుతున్నారు. ఈ ఊరు చాలా పురాతనమైందని చరిత్ర చెబుతుంది ఎలానంటే ఈ ఊర్లో చోళులు నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఊరిలో ఉన్న మనుషుల రాతలు మారుతున్నాయి కానీ ఊరికి ఉన్న రోడ్ రాత ఎప్పుడు మారుతుందోనని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక్కడి నుంచి ఉద్యోగ, వ్యాపార వ్యవసాయ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడినా స్వంత ఊరు అనే మక్కువ తో పండుగలకు, వేడుకలు కు వచ్చినప్పుడు నిట్టూర్పు వ్యక్తం చేస్తూ మా రాతలు మారాయి, మీ రాతలు మారాయి కానీ మన ఊరి రోడ్ రాత మారలేదు . పర,అర అయితే తలో చేయి వేసుకునేవాళ్ళం కానీ కిలోమీటర్లు ఉంది అని వాపోయేవాళ్ళట.ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం సౌకర్యం విషయమై విశాలాంధ్ర జిల్లా ప్రతినిధి వద్ద తమ గోడును వ్యక్తం చేస్తూ కాలము మారిపోయింది ఏఐ తో ఇంటర్నెట్లో ప్రపంచమంతా పరుగులు తీస్తూ ఉంటే 7000 మంది జనాభా ఉన్న మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం ఎంత దయనీయమో ! ఒక్కసారి ఆలోచించండి. మేము గ్రామంలో ఉంటున్నామో ?.. అడవిలో ఉంటున్నామో ? అర్థం కావటం లేదు . మారుమూల గిరిజన గ్రామాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ఉంటే మా ఊరికి మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా ఎందుకు రోడ్డు వేయటం లేదు. సుమారుగా 20 సంవత్సరాల నుండి ఈ రోడ్డును గురించి పట్టించుకున్న వారు లేరు. మా ఓట్లు కావాలి, మా ద్వారా పన్నుల రూపంలో డబ్బులు కావాలి కానీ కనీస అవసరమైన రోడ్డు వెయ్యాలని ఎవరికీ అనిపించడం లేదు. మా ఊరికి చివర గోదావరి గట్టు కు దగ్గరగా హైస్కూల్ ఉంది. గోదావరి గట్టు నుండి ఊరు సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పిల్లలు ప్రతిరోజు ఈ గుంతల రోడ్డు వెంబడి 3 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది . రోడ్డు ఇలా ఉంటే పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేవరకు తల్లిదండ్రులకు టెన్షన్ గా ఉంటుంది. పిల్లలు గోతుల్లో సైకిల్ తప్పుకోలేక పడిపోయి గాయాలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం ఈరోజు ఎవరు పడ్డారు..? ఎన్ని దెబ్బలు తగిలాయి అనే గుసగుసలు ఊరు చేరుకున్నాక వినిపిస్తున్నాయి. అలాగే మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు . పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి కానీ మా గ్రామానికి బస్సు వెలుగు కూడా లేదు. అంటే ప్రభుత్వం మా గ్రామాన్ని పల్లె గా కూడా గుర్తించక వెలివేసినట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం మహిళలకు స్త్రీశక్తి పేరిట రాష్ట్రమంతా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా మాకు అది కూడా అందటం కష్టంగా భావిస్తున్నాము . ఎందుకంటే ముందు మేము గ్రామం నుండి మూడు కిలోమీటర్లు ప్రయాసతో నడిచి గట్టు వద్దకు చేరుకుంటేనే కదా ఉచిత బస్సు ఎక్కేది అని అంటున్నారు. పుట్టిన బిడ్డనైనా, చనిపోయిన వ్యక్తినైనా ఈ రోడ్డు గుండానే తీసుకెళ్లాలి. ఎవరైనా ప్రసవ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించి ఏటి గట్టుకు వెళ్లేలోపు అయితే ప్రసవం అవుతుంది లేకపోతే విషాదం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఊరు ప్రజలు ఎక్కువగా నిత్యావసర వ్యాపారాలు అయిన బెల్లం, జామకాయలు, బొప్పాయి, అరటి కాయలు, నిత్యం రాజమండ్రి, కొవ్వూరు తదితర పట్టణాలు కు సైకిల్ పై వెళ్లి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ రోడ్డుపై ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి బతుకుదెరువు కోసం ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్ లేని ఈ గ్రామ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మేము ఇంకా ఏ కాలంలో ఉన్నామో మాకు అర్థం కావటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ ద్వారా కలెక్టర్ గారికి అర్జీలు కూడా పెట్టుకుంటున్నామని దానికి అధికారులు స్పందిస్తూ కొంతమంది కి ఫోన్ చేసి మీ రోడ్డు వేయడానికి నిధులు లేవని , ఈ రోడ్డు వేయడానికి ఏ శాఖ కు చెందిందో ముందు పరిశీలించి ఆ శాఖ నిధులు మంజూరు చేయాల్సి ఉంటుందని కంగారు పడకండి పెద్దగా చేసి మంచి రోడ్ వేస్తామని చెబుతుంటే గ్రామస్తులు మాత్రమే ధీటుగా స్పందిస్తూ ఆ వివరాలు మాకు తెలీయవని , ఇన్ని సంవత్సరాలు అయినా కంగారు పడవద్దు అనడంలో అర్థం లేదని మా ఊరు కి మూడు రహదారులు ఉన్నాయని ఒక రహదారి చంద్రవరం గ్రామం నుండి, రెండవది విజ్వేశ్వరం వంతెన దగ్గర నుంచి ఉందని, ప్రధానమైన దారి మాత్రం మద్దూరు బోర్డు పి ఆర్ రోడ్ అని ఉంటుందని ఏ దారి ఏ శాఖ పరిధిలోకి వస్తుందో మాకు తెలియదని మూడు రోడ్లు ఉన్నా రోడ్డు లేని దుస్థితిలో మేము ఉన్నాము కాబట్టి వీలైతే మూడు రోడ్డులను పునరుద్ధరించండి లేదా కనీసం పిల్లలు వెళ్లే ప్రధాన రోడ్డు ను ఆయినా వేయించండి అని వేడుకుంటున్నారు. గ్రామస్తులు అందరి చేత సంతకాలు సేకరించి కొవ్వూరు ఆర్డీవో , జిల్లా కలెక్టర్ లకు వినతి పత్రాలు సమర్పిస్తామని కూడా చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు