హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దు
అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల మండిపాటు
నాలుగు గంటలకు పైగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానం సాంకేతిక కారణాలతో క్యాన్సిల్ అయింది. కానీ, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. నాలుగు గంటలకు పైగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన విషయాన్ని కూడా తమకు ఆఖరి నిమిషంలో చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 5.30 గంటలకు 47 మంది ప్రయాణికులతో విమానం తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అయితే, విమానంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా రద్దు చేశారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు ఈ విషయం తెలియడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దర్శన సమయం కూడా దాటిపోతుందని, అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.