విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 5వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు షేక్, ఇస్మాయిల్, దస్తగిరి, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి షేక్షావలి, అల్లాబకాష్, హనుమంతు, ఆంజనేయ, ఎల్లప్ప, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


