విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ రానుందని, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించే సేవల్లో వేగం, పారదర్శకత పెంచేందుకే యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల యానిమేటర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను పంగల్ రోడ్డు సమీపంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 120 మందికి ఈ ఫోన్లను ఆమె పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనను ఆధునీకరించే క్రమంలో భాగంగా మహిళా సంఘాల పనితీరును మెరుగుపరచడానికి ఈ ఉచిత మొబైల్ ఫోన్లు ఇస్తున్నామన్నారు. ఇకపై గ్రూపు నిర్వహణ, రుణాలు, పుస్తకాల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యానిమేటర్లు నేరుగా రాష్ట్ర సర్వర్లకు అప్లోడ్ చేయవచ్చని, దీనివల్ల ఏ సభ్యురాలు ఎంత డబ్బు చెల్లిస్తున్నారు, అది బ్యాంకుకు చేరుతోందా లేదా అనే వివరాలు అత్యంత పారదర్శకంగా ఉంటాయని వివరించారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా రికార్డుల నిర్వహణ సులభతరం కావడమే కాకుండా, వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందన్నారు. కావున యానిమేటర్లందరూ ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకుని మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్, డీఆర్డీఏ పీడీ శైలజ, రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లు సుశీల, లక్ష్మీదేవి చంద్రకళ, ఎఫ్ఈఓ అధ్యక్షురాలు ధనలక్ష్మి, చంద్రకళ, మూడు మండలాల ఏపీఎం సునీత, ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు, విఓఎలు పాల్గొన్నారు.


