Homeజిల్లాలుఏలూరుగిరిజన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు…

గిరిజన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు…

- Advertisement -

జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఐటిడిఏ నిధులు ఖర్చు చేస్తే కఠిన చర్యలు-ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ…

గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పనులు మార్చ్,31వ తేదీ నాటికి పూర్తిచేయాలి…

గిరిజనుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ పై చర్యలు….

ఐటిడిఏ కార్యక్రమాలను అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి…

          విశాలాంధ్ర -ఏలూరు : గిరిజన ప్రాంతాలలో అభివృద్ది,  సంక్షేమ పధకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  గిరిజనులు గిరిజనుల సామజిక, ఆర్ధిక అభివృద్ధికి , గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి జన్ మన్ యోజన, ధర్తి ఆబా జనభాగిదారి అభియాన్ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు.   ప్రధానమంత్రి జన్ మన్ యోజన, తదితర కార్యక్రమాల ద్వారా  మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు గృహాలు, త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్యా, ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేసిందని, వాటికి సంబందించిన పనులను మార్చ్ నెలాఖరు నాటికి పూర్తిచేసి, నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు.  పంచాయతీ రాజ్ ద్వారా మంజూరైన 12 రోడ్లుకు  సంబందించి 56 పనులను పూర్తిచేయాలన్నారు. రోడ్లు, ఆర్ డబ్ల్యూ ఎస్ పనులకు సంబంధించి అటవీ శాఖ నుండి అనుమతులు వెంటనే పొంది పనులు ప్రారంభించాలన్నారు.  గృహ నిర్మాణాలకు సంబంధించి స్వయం సహాయక సంఘ సభ్యులకు అదనపు రుణాలు అందించి గృహాలు నిర్దేశించిన సమయంలోగా పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామీణ నీటి సరఫరా పధకం ద్వారా 86 పనులు మంజూరుకాగా, 78 పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు 15 రోజులలో  పూర్తిచేయాలన్నారు.  గిరిజన ప్రాంతాలలోని 86 గ్రామాలకు గాను 81 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం అందించారని, మిగిలిన 5 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం పనులు పూర్తి చేయాలన్నారు.  మొబైల్ టవర్ల ఏర్పాటు పనులను కూడా ఫిబ్రవరి లోగా పూర్తి చేయాలన్నారు.  గిరిజన ప్రాంతాలలోని పాఠశాలలు, వసతి గృహాలకు కావలసిన త్రాగునీరు, టాయిలెట్లు, వంటి సౌకర్యాలపై రెండురోజుల్లోగా ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలన్నారు.  అన్ని గిరిజన పాఠశాలలు, వసతి గృహాలలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి అవి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు;. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ  అందించి, జాబ్ మేళాలు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఐటిడిఏ నిధులు వినియోగిస్తే కఠిన చర్యలు…

ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ…

జిల్లా కలెక్టర్ ఐటిడిఏ లో అకౌంట్స్ అధికారి బదిలీ అయి 3 నెలలు అయినప్పటికీ వారి స్థానంలో వేరొకరిని నియమించకపోవడం, నిధులు వినియోగంపై ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్ పై కలెక్టర్ వెట్రిసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటిడిఏ నిధులను జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే ఖర్చు చేయాలన్నారు. ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేయిస్తానని, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా నిధులు వినియోగించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఐటిడిఏ పరిధిలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయవలసిన ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి పనుల పర్యవేక్షణలో విఫలం కావడం, సమీక్షలో సరైన సమాచారం అందించకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపరచుకోవాలని ఐటిడిఏ పిఓ ను ఆదేశించారు.

గిరిజనులకు అందించే వైద్య సేవలపై కలెక్టర్ అసంతృప్తి…

గిరిజన ప్రాంతాలలో గత 9 నెలల్లో 281 మంది మహిళలకు అబార్షన్స్ కావడం, 319 మంది పుట్టిన పిల్లలు నమోదు కాకపోవడం, ఎన్ సి డి సర్వే, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల వివరాలు, రక్తహీనత తో బాధపడుతున్న ప్రజల వివరాలు, అందుకు తీసుకున్న చర్యలు, ఇమ్మ్యూనైజేషన్ ,ఐటిడిఏ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రులలో గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై సరైన సమాచారం అందించని ఐటిడిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. సురేష్ కుమార్ పనితీరుపై సమగ్ర విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ డా. అమృతం ను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా 281 మహిళలకు అబార్షన్స్ కావడంపై కూడా కేసు వారీగా వివరాలు సమర్పించాలని డిఎంహెచ్ఓ ని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో బాల్య వివాహాల కారణంగా అబార్షన్స్ అవుతున్నాయని ఐటిడిఏ పి ఓ రాములు నాయక్ తెలియజేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాల్య వివాహాలు అరికట్టాల్సిన అధికారులు, జరుగుతున్నాయని తెలియజేయడం బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు.సమావేశంలో డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, ఐసిడిఎస్ పీడీ శారద, డిఈఓ వెంకటలక్ష్మమ్మ , డిఆర్డిఆ పీడీ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్ఈ, ఐటిడిఏ లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు