విశాలాంధ్ర, హైదరాబాద్ : డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అనుబంధ లేదా అనుకూల ప్రభుత్వాలు ఉంటే వాటిని డబుల్ ఇంజన్ సర్కార్‌గా మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని, దీనర్ధం బిజెపికి అనుకూలంగా లేని ప్రభుత్వాలకు రాజ్యాంగ పరంగా రావాల్సిన నిధులు, సౌకర్యాలు ఇవ్వదల్చుకోలేదని పరోక్షంగా మోడీ సర్కార్ బహిరంగంగా చెపుతున్నదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.యస్.బోస్ అన్నారు. దీనిని దేశంలోని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండిరచాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంత సహాయ నిరాకరణ పాటించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేరళ రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం అన్ని రంగాలలో ముందంజవేస్తూ ఆ రాష్ట్రంలో పేదరికాన్ని అత్యల్ప స్థాయికి తీసుకురావటం హర్షించదగిన విషయం. కేరళ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు అన్ని విషయాలలో ఆదర్శంగా నిలబడటం వామపక్ష ప్రభుత్వ ప్రత్యేకతను తెలియజేస్తుంది. మోడీ ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తామని ప్రతిపాదిస్తే ఆ సంస్థలను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతామని కేంద్రానికి ప్రతిపాదించటం ప్రస్తుత కార్పొరేట్ పరిపాలనలో అత్యంత సాహాసోపేతమైన నిర్ణయంగా భావించాలి. రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారా లేక సింగిల్ ఇంజన్ సర్కారా అన్నది ప్రాధాన్యం కాదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం లాగా నిజాయితీ, నిబద్ధత, ప్రజల యడల అంకితభావం కల్గిన సర్కార్ ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కేరళ రాష్ట్ర ఉదాంతం తెలియజేస్తున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అని డంకా ఊదుతూ బీహార్ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న మోడీ మరియు ఆ రాష్ట్ర విఫల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇద్దరు కలిసి ఆ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో సఫలీకృతమయ్యారు. బీహార్ రాష్ట్రంలో ఉపాధి లేక లక్షలాది మంది కార్మికులు వలసలు వచ్చి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న విషయం పరిశీలిస్తే బీహార్ రాష్ట్రం ఎంత వెనుకబడి ఉన్నదో ప్రజలకు అర్ధమవుతుంది. బీహార్ రాష్ట్రం వెనుకబాటుకు కారకులైన మోడీ నితీష్ ద్వయం డబుల్ ఇంజన్ సర్కార్ అని మరోసారి ఎన్నికలలో ప్రజల ముందుకు రావటం సిగ్గులేనితనాన్ని తెలియజేస్తున్నది. బీహార్ ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్‌ను ఆ రాష్ట్ర ప్రజలు ఓడించటం కాయమని, ఆ రాష్ట్రంలో రాజకీయ చరిత్రను తిరగరాయటానికి ప్రజలు సిద్దమవుతున్నారని వి.యస్.బోస్ తెలియజేశారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అన్ని రాష్ట్రాల్లో విఫలం
- Advertisement -
RELATED ARTICLES


