డీఎస్పీ ఆఫీసు ముందు ధర్నా


విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గంలో ఆర్డిటి ఆసుపత్రి ఎదురుగా దుకాణాల తొలగింపు ఉద్రిక్తత లకు దారి చేసింది. శనివారం ఉదయం 6 గంటలకు మున్సిపాలిటీ అధికారులు, పోలీసు అధికారులు కలిసి ఆర్డిటి ఆసుపత్రి ప్రహరీ గోడకు అనుకుని ఉన్న దుకాణాలను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. పేదలు వేసుకున్న దుకాణాలను ఎలా తొలగిస్తారు అంటూ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ , పట్టణ కార్యదర్శి ఓంకార్, సహాయ కార్యదర్శి సలా ఉద్దీన్, బుడెన్ , నరసింహులు, తదితరులు అడ్డుకున్నారు. డిఎస్పి రవిబాబుతో వాగ్వాదానికి దిగారు . మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ప్రసాద్ దగ్గర పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతో ధర్నాకు దిగారు. దీంతో ఆక్రమణ తొలగింపు అడ్డుతగులుతున్నారని సిపిఐ నేతలను అరెస్టు చేసి సెట్టూరు పోలీస్ స్టేషన్కు తరలించి మధ్యాహ్నం 3 గంటల దాకా అక్కడే ఉంచారు. దీంతో నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం ఉండడంతో ఇక్కడికి వచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి సిపిఐ నేతలను అరెస్టు చేశారని తెలుసుకుని డీఎస్పీ కార్యాలయం వద్దకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి నరసింహులు, మండల కార్యదర్శి ఆంజనేయులు, బ్రహ్మసముద్రం మండల కార్యదర్శి నాగరాజు నాయక్, వెంకటేశులు, తిమ్మరాయుడు తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎర్రజెండాలు పట్టుకుని పోలీసుల జులుం నశించాలి, పేదలకు న్యాయం జరగాలి అంటూ నినాదాలు చేశారు . డిఎస్పి రవిబాబు, సీఐ హరినాథ్ లను నిలదీశారు. తమ నాయకులను పోలీస్ స్టేషన్లో బంధించారని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు . పేదల దుకాణాలను మాత్రమే తొలగిస్తూ పట్టణంలో ప్రధాన రహదారుల్లో ఆక్రమణలు చేసి భవనాలు కట్టిన వారిపై మున్సిపాలిటీ అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. సిపిఐ నేతల ధర్నాతో దిగివచ్చిన డీఎస్పీ రవి బాబు సెట్టూరు పోలీస్ స్టేషన్లో ఉంచిన నాయకులను విడుదల చేసి కళ్యాణదుర్గం తీసుకొచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.


