ఏడు రోజుల్లో నూతన 108 వాహనం మంజూరు
– విశాలాంధ్ర కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి
విశాలాంధ్ర – సీతానగరం : రానున్న ఏడు రోజుల్లో సీతానగరం మండలానికి అత్యాధునిక వైద్య సాంకేతిక సదుపాయాలు ఉన్న భవ్య హెల్త్ సర్వీసెస్108 నూతన వాహనాన్ని మంజూరు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. అత్యవసర వాహనానికే సుస్తీ చేస్తే ఎలా అంటూ మండల కేంద్రమైన సీతానగరం నుండి విశాలాంధ్ర దినపత్రికలో వెలువడిన కథనానికి భవ్య హెల్త్ సర్వీసెస్ తరుపున జిల్లా వైద్యాధికారి శనివారం స్పందించారు. దీనిలో భాగంగా పత్రిక వివరణతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీతానగరం మండలంలోని 21 గ్రామ పంచాయతీ ల్లోని 23 గ్రామాల ప్రజలకు అత్యవసర సమయంలో సేవలు అందించే 108 వాహనాన్ని సాంకేతిక సమస్యలు, బాడీ మరియు ఎలక్ట్రికల్, మెకానికల్ రిపేర్లు తరచూ వస్తున్నాయని స్పష్టం చేశారు.కాగా పాత వాహనం స్థానంలో వేరొక కండిషన్లో ఉన్న 108 వాహనాన్ని సీతానగరం మండలం సమీపంలో అత్యవసర సేవలు కోసం అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు.అదే విధంగా నూతన వాహనానికి సైతం అనుమతులు మంజూరు అయ్యిందని,రానున్న వారం రోజుల్లో ఆ వాహనం అందుబాటులోకి వస్తుందని భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థ తరుపున తెలిపారు.


