విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకత, జాతీయత, దేశభక్తి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల రామాంజనేయులు శనివారం వజ్రకరూరు మండల కేంద్రంలో జాతీయ జెండాలు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి తరం యువత, విద్యార్థులు స్వాతంత్ర్య పోరాటం గురించి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల గొప్పతనం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకుని, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని యువత, విద్యార్థులకు సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


