విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు “ఫేష్ వాష్ అండ్ గో ” కార్యక్రమం నిర్వహించారు. గార్లదిన్నె మండలం కల్లూరు జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారి-44 పై సోమవారం తెల్లవారుజామున ఫేష్ వాష్ అండ్ గో చేపట్టారు. హైదరాబాద్- బెంగుళూరు ల వైపు వెళ్తున్న లారీలు, బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరోలను డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపించారు. ముఖం కడిగాక టీ తాగమని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేశారు. వాహనాల డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారకుండా పూర్తీగా తేరుకుంటే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చనే జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంకల్పంతో జిల్లాలో పోలీసులు ప్రధానంగా హైవేలపై ఈకార్యక్రమం నిర్వహిస్తున్నారు.