-ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం) : మండలాధికారులు 16 పంచాయతీల్లోని ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి సూచించారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ బి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. మండలాధికారులు గత మూణ్ణెల్ల ప్రగతిని చదివి వినిపించారు. ఏపీఓ సావిత్రి మాట్లాడుతూ మండలంలో 12067 జాబ్ కార్డులు ఉన్నాయని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పిస్తామన్నారు. జాబ్ కార్డులు ఉన్నవారు ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు తవ్వుకునేందుకు ప్రభుత్వం రూ.6వేలు మంజూరు చేస్తుందన్నారు. మునగ, రోజా, మల్లెలు, హార్టికల్చర్, ప్లాంటేషన్లకు ఉపాధి హామీ పథకం చేయూతనందిస్తుందన్నారు.మునగ సాగుకు ఎకరాకు రూ.1,27000మంజూరు చేస్తామని, ఐదెకరాలలోపు ఉన్న రైతులు అర్హులన్నారు. ప్రస్తుతం ఒక ఎకరాకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందన్నారు.
గులాబీ, మల్లె సాగుకు ఎకరాకు రూ.1,17,000 సబ్సిడీ ఇస్తూ రెండేళ్లపాటు పోషణకు సహకారం అందిస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ జెఈ వరలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల నిర్మాణానికి పరిష్కారానికి రూ.3.71లక్షల, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.57 లక్షలు నిధుల ఖర్చుకు పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. బెంగళూరు, హిందూపురం ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు రాప్తాడు గ్రామం నుండి వెళ్లేలా, బొమ్మేపర్తి, పుల్లలరేవు, హంపాపురం గ్రామాలకు ఆర్డినరీ సర్వీసు బస్సులను నడపాలని
ఎంపీటీసీ జాఫర్, సర్పంచులు శీనయ్య, తిరుపాలు, ఉజ్జినప్ప, నరేష్, ఆర్టీసీ అధికారులను కోరారు. ఉద్యాన పథకం కింద పండ్ల తోటల పెంపకానికి, చీడపీడల నివారణకు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తామని ఉద్యాన అధికారి దివ్య తెలిపారు. కార్యక్రమంలో ఇతర మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


