విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని శుక్రవారం జిల్లా పోలీసు ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రి వారి సౌజన్యంతో చేపట్టారు. పోలీస్ సిబ్బంది తమ విధుల్లో నిత్యం బిజీగా ఉండడం వల్ల ఆరోగ్య పరీక్షలకు సమయం కేటాయించలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ .. సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరిరక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో నిపుణులైన వైద్యుల బృందం పాల్గొని పురుషులు మరియు మహిళలకు విభిన్న రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పురుషులకు ఎక్స్‌రే, పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెషఫిక్ ఆంటీజెన్ ), యూఎస్‌జీ (అల్ట్రాసౌండ్), సీబీసీ (కంప్లీట్ బ్లడ్ కౌంట్ ) వంటి పరీక్షలు నిర్వహించగా… మహిళలకు మామోగ్రఫీ, పాప్ స్మియర్, సీబీసీ వంటి పరీక్షలు చేసి క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించేలా వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందుకే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, ఆర్ ఐ మధు, ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్. అనంతపురం సవేరా ఆసుపత్రికి చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహబూబ్ బాషా, జనరల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ ఆదిశేషు, ఏజీఎం ఇస్మాయిల్, మేనేజర్ హరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
- Advertisement -


