సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర -ధర్మవరం : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు కోర్టు దూరంగా చట్టపరంగా ఉచితంగా న్యాయం చేకూర్చబడునని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో గల ఆర్డిటి స్కూల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చక్కటి చదువుకు భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తెలిపారు. నేటి సమాజంలో అందరితోపాటు దివ్యాంగులు కూడా ముందడుగులో ఉన్నారని తెలిపారు. చదువులో కూడా చక్కటి ప్రతిభ ఘనపరిస్తే, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులకు ఏదైనా సమస్యలు పరిష్కారం కావాలంటే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా రాతపూర్వకంగా అందజేస్తే ఉచితంగా ఖచ్చితంగా న్యాయంతో కూడిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అనంతరం న్యాయవాదులు బిల్లే రవి, బాల సుందరి, బాబా ఫక్రుద్దీన్ లో మాట్లాడుతూ దివ్యాంగులను గౌరవంగా పలకరించాలని, వారికి తోడునీడుగా ఉంటూ వారిని జీవితంలో ప్రోత్సహించే విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. నేడు దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో ముందంజలో ఉండడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి సిబ్బంది, అధికారులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


