విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు సర్వే నెంబర్ 1184 లోని 6 ఎకరాల ఇనాం భూమిని ఉన్నత పాఠశాల నిర్మాణానికి అనువుగా క్లాసిఫికేషన్ చేసి అవసరమైన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అలాగే సర్వే నెంబర్ 380లో గత 80 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే పెద్దకడబూరు గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ భవనాలు ఉన్నప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి ప్రత్యేక భవనం లేకపోవడంతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించి సామాజిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పెద్దకడబూరు నుంచి కల్లుకుంట, మేకడోణ, కంబళదిన్నె, బనవాసి గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బ తిన్నాయని, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.


