–ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని హెచ్ మురవణి, పెద్దకడబూరు గ్రామాలలో ఉద్యాన శాఖ మరియు లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం ఆయిల్ పామ్ తోటల సాగు పైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక మాట్లాడుతూ అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ పామ్ పంట అన్నారు. ఉద్యాన శాఖ నుంచి 100 శాతం సబ్సిడీతో మొక్కలు ఇవ్వడంతో పాటు, నాలుగు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చుకై తోడ్పాటు, ఉంటుందని తెలిపారు . దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కలెక్షన్ సెంటర్లలో నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయిల్ పామ్ పంట సాగును చేయాలనుకున్న రైతులు మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని లేదా లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు . ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, బీసీ సెల్ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, మండల ఉద్యాన శాఖ అధికారి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి సుచరిత, రైతు సేవా కేంద్రం సిబ్బంది కిషన్, శ్వేత, లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సుమంత్ పాల్, ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు రైతులు పాల్గొన్నారు.


