–పుణ్యస్నానాలు ఆచరించిన వేలాదిమంది భక్తులు
విశాలాంధ్ర-ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలో పెన్నా నది తీరంలో వెలసిన శ్రీ ఏటి గంగమ్మ అమ్మవారి జాతర (తిరునాళ్ళ) ఆదివారం ఘనంగా జరిగింది. పవిత్ర మాఘ మాసంలో 3వ ఆదివారం నాడు ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతాయి.తిరునాళ్ళ సందర్భంగా తెల్లవారుజాము నుండే పెన్నా నదిలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.గంగమ్మ దేవతను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. మాఘ మాసంలో ఇక్కడ స్నానాలు ఆచరించి పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. పూజలు అనంతరం నది వడ్డునే వంటావార్పు చేసి కుటుంబ సభ్యులతో కలసి భోజనాలు చేశారు. ఈ జాతరలో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు గంగమ్మ దర్శనం కోసం తరలివచ్చారు.


