Homeజిల్లాలుఏలూరుయద్దనపూడి స్పూర్తితో..వృత్తి విలువలను కాపాడుకోవాలి

యద్దనపూడి స్పూర్తితో..వృత్తి విలువలను కాపాడుకోవాలి

- Advertisement -

15 వ వర్ధంతి సభలో వక్తల పిలుపు

విశాలాంధ్ర- తాడేపల్లిగూడెం: ఆరు దశాబ్దాలపాటు పత్రికారంగంలో, ప్రజాజీవితంలో కొనసాగిన యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి జీవితాన్ని నేటితరం స్పూర్తిగా తీసుకోవాలని, మీడియాలో వృత్తి విలువలను, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పలువురు వక్తలు పిలుపు ఇచ్చారు.
సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సేవకుడు కీ.శే. యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి 15 వ వర్ధంతి కార్యక్రమం ఎ.పి.యు.డబ్ల్యూ.జే. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగింది. యద్దనపూడి స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార ప్రదానం,, సీనియర్ పాత్రికేయుల గౌరవ సత్కార కార్యక్రమం కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
తాడేపల్లిగూడెం మండలపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ఎ.పి.యు.డబ్ల్యు.జే. జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ అధ్యక్షత వహించారు. గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ దివంగత యద్దనపూడి గారి పేరిట ప్రతి ఏటా క్రమం తప్పకుండా గత పదిహేను సంవత్సరాలుగా యద్దనపూడి కుటుంబ సహకారంతో అవార్డులు, సత్కారాలు కొనసాగిస్తున్నామని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర ఉపాధ్యక్షుడు , విశాలాంధ్ర దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ చావా రవి మాట్లాడుతూ నిన్నటి తరం పాత్రికేయులు ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి, ప్రజల గొంతుకగా నిబద్ధతతో పనిచేశారని, వారి కృషిని నేటితరం పాత్రికేయులు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. పదిహేనేళ్ల క్రితం కన్నుమూసిన పాత్రికేయుడు యద్దనపూడి సూర్యనారాయణ మూర్తిని తాడేపల్లిగూడెం పౌరసమాజం గుర్తుంచుకోవడాన్ని బట్టి ఆయన ప్రజాజీవితంపై వేసిన ప్రభావం బలమైనదన్న విషయం అర్థం అవుతుందని అన్నారు. యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి తన జీవితకాలంలో చేసిన కృషి ఆదర్శప్రాయమైనదని, నేటితరం పాత్రికేయులు వీలైనంత మేరకు వారి ఆదర్శాలను అనుసరించాలని కోరారు.
మీడియా ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని కోరారు.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణ చరిత్ర నిర్మాతల్లో యద్దనపూడి ఒకరని, పత్రికా విలేకరిగా, సంఘ సేవకునిగా ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరపురానివని అన్నారు. వారు పాటించిన వృత్తి విలువలను, ఆచరించిన ఆదర్శాలను గుర్తు చేయడం, నేటి తరం పాత్రికేయులకు యద్దనపూడి స్ఫూర్తిని అందించడం లక్ష్యంగా వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఏర్పాటు చేశామన్నారు. వచ్చిన ఎంట్రీలనుండి ఎంపిక చేసిన విలేఖరికి పురస్కారం అందచేస్తున్నామని , అలాగే జిల్లాలో చిరకాలంగా సేవలు అందిస్తున్న సీనియర్ పాత్రికేయులను గుర్తించి సత్కరిస్తున్నామని తెలిపారు. యద్దనపూడిని స్మరించుకోవడం అంటే చరిత్రను గుర్తు చేసుకోవడమే అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు