విశాలాంధ్ర-రాప్తాడు : సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు సీఐ టీవీ శ్రీహర్ష హెచ్చరించారు. కొంతమంది మైనర్ బాలురు స్కూటర్లలో రాప్తాడు 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయంపై ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పూర్తి విచారణ చేసి మంగళవారం పిల్లల తల్లిదండ్రులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతపురం రాణినగర్ కు చెందిన 6 మంది విద్యార్థులు మూడు బైకులను బుక్కరాయసముద్రంలో జరిగిన రథోత్సవానికి వెళ్లి అక్కడి నుంచి రాప్తాడు మండలం అయ్యవారిపల్లి వద్ద ఉన్న వంక దగ్గర ఈతకు వెళ్లారన్నారు. తర్వాత వారు అనంతపురం వెళుతున్న సమయంలో ఒక బాలుడు తన వేసుకున్న షర్టు విప్పేసి స్కూటీ నడుపుకుంటూ వెళ్లాడన్నారు. దీన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గంజాయి మత్తులో హల్చల్ ప్రకటనలకే పరిమితమైన పోలీసులని వీడియో తీసి ప్రచారం చేశాడన్నారు. తమ విచారణలో వీడియోలో కనిపిస్తూ స్కూటీపై వెళ్తున్న ఆరు మంది విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను స్టేషనుకు పిలిచి వారి సమక్షంలో పిల్లలను విచారించామన్నారు. ఒక విద్యార్థి షర్టు చినిగిపోగా షర్టు లేకుండా స్కూటీపై వెళ్లానని చెప్పాడన్నారు. మైనర్లు స్కూటర్లు నడిపినందున మూడు స్కూటర్లను సీజ్ చేసి తల్లిదండ్రులకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేశామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చర్యలకు ఉపక్రమించామన్నారు. పిల్లలకి కూడా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కౌన్సిలింగ్ ఇప్పించామన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి పూర్తి విషయాలను తెలుసుకోకుండా వాటిని వీడియోలు తీసి పోస్ట్ చేసి విషయాన్ని వక్రీకరించి పిల్లలను గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేయడం అసత్యమన్నారు. ఇలా చేయడం వల్ల పోలీసులపై ప్రజలలో ఇన్నాభిప్రాయాలు, వీడియోలో ఉన్న పిల్లలపై సమాజంలో దుష్ప్రభావం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యల్లో భాగంగా 94 బి.ఎన్.ఎన్.ఎస్ ప్రకారం నోటీసులు ఇచ్చి ప్రచారానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని చెప్పామన్నారు. ఎవరైనా వ్యక్తులు సోషల్ మీడియాలో సమాచారం పోస్ట్ చేసేటప్పుడు నిజా నిజాలను నిర్ధారించుకుని సర్కులేట్ చేయాలన్నారు.


