విశాలాంధ్ర – నార్పల: నార్పల మండలం పరిధిలోని బొందలవాడ గ్రామ పరిసరాల్లో చిరుత పులుల సంచారం తీవ్ర భయాందోళన సృష్టించింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వరుస ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, స్థానికుల ప్రతిదాడిలో ఒక చిరుత మృతి చెందినట్లు సమాచారం. సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి పొలంలో పనులు చేస్తుండగా పొదల్లో దాక్కున్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఆమె కేకలతో అక్కడి నుంచి పరిగెత్తిన చిరుత బొందలవాడ వైపు చేరింది. అదే సమయంలో పొలానికి వెళ్తున్న అంకె లక్ష్మీదేవి (40)పై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆమెను అనంతపురం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన కొనంకి నాయుడు, నారాయణస్వామి అనే గొర్రెల కాపరి కూడా చిరుత దాడికి గురయ్యారు. నారాయణస్వామి తీవ్రంగా గాయపడగా, అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కట్టెలు, రాళ్లతో ప్రతిదాడి చేసి ఒక చిరుతను చంపినట్లు తెలిపారు. స్థానికుల ప్రకారం, ఈ ప్రాంతంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకటి మృతి చెందినప్పటికీ మరొకటి ఇంకా పొదల్లోనే ఉండే అవకాశం ఉందని భయం వ్యక్తమవుతోంది.అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రైతులు గుంపులుగా పొలాలకు వెళ్లాలని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని అధికారులు హెచ్చరించారు.ఈ ఘటనలతో బొందలవాడతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైతులు పొలాలకు వెళ్లడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బొందలవాడలో చిరుతల సంచారం – వరుస దాడులతో గ్రామస్తుల్లో భయం..
- Advertisement -
RELATED ARTICLES


