దోనేపూడి శంకర్
విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు ఉద్యమ వందేళ్ళ మహాప్రస్థానంలో ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలు పనంగా పెట్టి పార్టీ కోసం పేద ప్రజల కోసం అనేక పోరాటాలు సాగించారని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. గురువారం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సంగుల పేరయ్య అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్ధింతి కార్యక్రమం చలసాని నగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరై చలసాని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ లాంటి నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి రౌడీ మూకలు నుంచి ప్రజలను కాపాడటానికి కర్ర చేత పట్టుకుని మహిళల మానప్రాణ రక్షణకు చలసాని వెంకటతర్నం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి హత్య గావించబడ్డారని తెలిపారు. 54 సంవత్సరాల కాలం గడిచిన ఈనాటికి ప్రజలు మరువలేదని వారి స్ఫూర్తితో అనేకమంది అమరవీరులు విజయవాడ నగరంలో ప్రాణార్పణ చేశారని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు అంకితం కావాలని పిలుపునిచ్చారు. జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల త్యాగాలు ప్రజలు మరువలేనివని నేడు నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే కమ్యూనిస్టుల త్యాగాలేనని అన్నారు. ఇళ్ల పట్టాలు, స్థలాలు సాధన కోసం ఈ నెల 24వ తేదీన మహత్తర పోరాట కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, డివిజన్ పార్టీ కార్యదర్శి అంబటిపూడి మోహన్,
డివిజన్ పార్టీ నాయకులు కూరాకుల స్టాలిన్ , జగన్నాథం ,సంగుల నాగబాబు, ప్రవీణ్ , విజయ టాక్సి సొసైటీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జల్లి చిన్న కార్యదర్శి పి నూకరాజు, యూనియన్ నాయకులు షేక్ గాలిబ్, కూరాకుల రవి, పార్టీ నాయకులు షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.


