కెనడాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది.
ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అధికారుల వివరాల ప్రకారం.. విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధమైంది.రన్‌వేపై టేకాఫ్ తీసుకునే సమయంలో విమానంలోని ఓ చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిల్చొని ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు.దీంతో చిన్నారి తల్లి, క్యాబిన్ సిబ్బంది కలిసి ఆమెకు సీట్‌బెల్ట్ పెట్టేందుకు కొన్ని నిమిషాలపాటు ప్రయత్నించారు.అయితే చిన్నారి ఎంతకీ వినకుండా ఏడుస్తూ మారాం చేసింది. దీంతో సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సీట్‌బెల్ట్ పెట్టించలేకపోయారు.
టర్మినల్‌కు విమానం
సీట్‌బెల్ట్ లేకుండా చిన్నారితో విమానాన్ని టేకాఫ్ చేయడం సురక్షితం కాదని సిబ్బంది భావించారు.దీంతో చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించేయాలని నిర్ణయించారు.ఈ క్రమంలో విమానం తిరిగి టర్మినల్‌కు చేరుకుంది. చిన్నారిని, ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించిన తర్వాత.. నిబంధనల ప్రకారం వారి ఫ్లైట్ ప్లాన్‌లను సిబ్బంది మళ్లీ ఫైల్ చేయాల్సి వచ్చింది.ఈ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి రాత్రి 12:30 గంటలు దాటిపోయింది.అప్పటికే రన్‌వేను మూసివేయడంతో విమానాన్ని తిరిగి నడపడం సాధ్యం కాలేదు. దీంతో సదరు విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేశారు.
ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన పోర్టర్ ఎయిర్‌లైన్స్
విమాన సర్వీసు రద్దవడంతో అందులో ప్రయాణించాల్సిన ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.మరుసటి రోజు అదే విమానంలో వారిని తిరిగి గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.ఇందుకు పోర్టర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.


