విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఈనెల 12న జరిగే ఛలో కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరును నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, బూత్ కమిటీ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ యూత్ విభాగం అధ్యక్షులు నరవ రాజశేఖర్ రెడ్డి, నాయకులు శివరామిరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు దయ్యాల మహబూబ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి స్వగృహం నందు యువత పోరు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు, విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. త్రైమాసికాలుగా ఫీజు రీయంబర్స్ మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,600 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చెయ్యాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు 3 వేలు ఇవ్వాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద యువత పోరు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ పోరుకు నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ముక్కరన్న, నాయకులు బ్రహ్మయ్య, దిట్టికాటి లింగన్న, సోషల్ మీడియా కో కన్వీనర్ తిమ్మప్ప, ప్రసాద్, గూడు భాష, మారెన్న, కోరి వెంకటేశ్వర్లు, బందే నవాజ్ తదితరులు పాల్గొన్నారు.