విశాలాంధ్ర – మండపేట : పట్టణ మున్సిపల్ చైర్మన్ హోదాలో వున్న పతివాడ రాణి కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమో ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు 11వ వార్డు కౌన్సిలర్ కొవ్వాడ బేబి, 17వ వార్డు కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్యభవాని లు పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆవిడకు అవమానం జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కౌన్సిల్ చట్టాలపై అవగాహన పెంచుకుని అప్పుడు ప్రెస్ మీట్ లు పెడితే బాగుంటుందన్నారు. అయితే ఒక విషయం మాత్రం ఆవిడ నిజం చెప్పారని ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే అంటారుగా అని అన్నారని, అది అక్షరాల నిజమన్నారు. ఆరు నూరైనా నూరు ఆరైనా ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రోటోకాల్ పాటించి తీరతారని స్పష్టంచేశారు. గతంలో ప్రోటోకాల్ పక్కన పెట్టీ తప్పుడు శిలాఫలకాలు ఏర్పాటు చేయడం దానిపై పిర్యాదు చేస్తే అధికారులు మార్చడం ఇలాంటివి వైసిపి నాయకుల హయాంలో జరిగిందని విమర్శించారు. ఇటువంటి చరిత్ర వారికి ఉందేమో తమకు లేదన్నారు. తమ నాయకుడు వేగుళ్ళ ఎప్పుడూ విలువలకు కట్టుబడి వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నాయకులు సభా మర్యాదలు విస్మరించి ఎన్ని తప్పుడు పనులు చేసినా కూటమి అధికారంలో ఉండగా మాత్రం మీరెంతో స్వేచ్ఛగా సభలకు వచ్చి మాట్లాడుతున్నారంటే అందుకు ఎమ్మెల్యే వేగుళ్ళ మంచితనం, విలువలే కారణమన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టీ మాట్లాడేటప్పుడు వెనుకా ముందు ఆలోచించాలన్నారు. శిలాఫలకం ప్రోటోకాల్ విషయం లో అనుమానాలు ఉంటే నిస్సందేహంగా అధికారులకు పిర్యాదు చేసుకోవచ్చన్నారు. నిబంధనలు, చట్టాలు పై అవగాహన లేకుండా మరోసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.


