Homeజిల్లాలుఅనంతపురం15 రోజులుగా చుక్క నీరు లేదు.. విడపనకల్లులో తాగునీటి కోసం ప్రజల తిప్పలు..

15 రోజులుగా చుక్క నీరు లేదు.. విడపనకల్లులో తాగునీటి కోసం ప్రజల తిప్పలు..

- Advertisement -

కాగితాలపై సమస్య పరిష్కారం.. క్షేత్రస్థాయిలో మాత్రం దాహంతో ప్రజల అవస్థలు

విశాలాంధ్ర – విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాలకు సీపీడబ్ల్యూఎస్ (రక్షిత మంచినీటి సరఫరా) పథకం ద్వారా తాగునీరు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 నుంచి 15 రోజులుగా చుక్క నీరు కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, సంబంధిత ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.నెలల తరబడి తాగునీటి సమస్య కొనసాగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం కేవలం ఫిర్యాదులను కాగితాలపైనే ముగించేందుకు పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో నమోదైన ఫిర్యాదు నిలిచింది. గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని ఓ గ్రామస్థుడు ఫిర్యాదు చేయగా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే “సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా నీటి సరఫరా జరుగుతోంది, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు, స్వయంగా పరిశీలించాను” అని నమోదు చేసి ఫిర్యాదును క్లోజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.గ్రామాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ప్రజల బాధలను తెలుసుకునేందుకు గ్రామాల్లోకి రావడం లేదని, కార్యాలయాలకే పరిమితమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.తాగునీరు అందక ప్రజలు సొంత డబ్బుతో నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబ అవసరాల కోసం 500 లీటర్ల ట్యాంకర్ నీటికి రూ.600 వరకు ఖర్చు చేయాల్సి వస్తుండగా, డ్రమ్ములతో నీరు తెచ్చుకోవడానికి ఆటోలకు రూ.300 వరకు చెల్లిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. మరికొందరు ద్విచక్ర వాహనాలపై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నీటిని తెచ్చుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ, విడపనకల్లు మండలంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లముందే తాగునీటి వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విడపనకల్లు మండలంలో తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు