విశాలాంధ్ర, మల్కాజిగిరి : స్థానిక మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్–2026’ ఉత్సవాలలో భాగంగా మంగళవారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా కళాశాల విద్యార్థులకు ‘నిజాయితీతో సమృద్ధి’ అనే అంశంపై తెలుగు, హిందీ,ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఈఎల్) ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.అడవి రాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. . ఈ సందర్భంగా యూనిట్ హెడ్, జనరల్ మేనేజర్ డా.సిహెచ్. విశ్వనాథం మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే నిజాయితీ, నైతిక విలువలను అలవర్చుకోవాలని, సమగ్ర సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. సంస్థ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రూత్ బెక్హామ్ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.అడవి రాజు అధ్యక్షోపన్యాసం చేస్తూ విద్యార్థులలో సామాజిక బాధ్యత, నైతిక స్పృహను పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా.రాజేష్ కుమార్ మూడు భాషల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల ఫలితాలను ప్రకటించారు. తెలుగు విభాగంలో ఎల్.మానస ప్రథమ, ఎన్.జస్వంత్ ద్వితీయ, ఇ. మల్లేశ్వరి తృతీయ బహుమతులు సాధించారు. ఇంగ్లీష్ విభాగంలో మైమూనా ప్రథమ, శీలం సాహితి ద్వితీయ, మహమ్మద్ బురాన్ సాబ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. హిందీ విభాగంలో అస్ఫియా బేగం ప్రథమ, ఉదయ్ సాహు ద్వితీయ, శిరీష తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ గుణాకర్తో పాటు వేదికపై ఉన్న ప్రముఖులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా డా.హరిత వ్యవహరించగా, డా.యాదగిరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.


